Damaged Roads in Guntur :ఆ రోడ్లెక్కితే షెడ్డుకు వెళ్లని ఆటో ఉండదు! నడుము పట్టేయని ప్రయాణికుడు ఉండడు! కుదుపులకు గావు కేక పెట్టని నోరు ఉండదు! ఇదేం నరకం బాబోయ్ అంటూ తిట్టుకోని జనం ఉండరు! అన్నీ తెలిసినా స్పందించిన అధికారి లేడు. నాలుగు సంవత్సరాలుగా అవే గుంతలు అవే కుదుపులు.! ఇవేమీ పల్లె ప్రజల కష్టాలు కాదు! ఘన చరిత్ర ఉన్న గుంటూరు నగర దుస్థితి! రోడ్లైనా వేయాలని, లేదంటే గుంటూరు పేరును గుంతలూరుగానైనా మార్చాలని ప్రజలు నిట్టూరుస్తున్నారు.
Public Facing Problems with Damaged Roads at Guntur :చినుకు పడితే చాలు.. గుంటూరు నగరంలోని అనేక రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. గుంటూరు నగర శివారు కాలనీల రహదారుల పరిస్థితి అయితే అత్యంత దయనీయంగా మారింది. మోకాలి లోతు గుంతలు, బురదమయమైన దారులతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షాలకే రాకపోకలు సాగించలేనంతగా రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయని, సుద్దపల్లి డొంక, ప్రగతి నగర్, రెడ్డిపాలెం ప్రాంత వాసులు వాపోతున్నారు. ఉద్యోగ, ఉపాధి పనుల నిమిత్తం రోజూ ఈ రోడ్డెక్కేవారి అగచాట్లు.. చెప్తే తీరేలా లేవు.
AP Damaged Roads ఏ రోడ్డు చూసిన గుంతలు, బురద మయం.. వర్షాలతో మరింత అధ్వన్నంగా గ్రామీణ రహదారులు..
గుంతల లోతు తెలియడం లేదు :నాలుగైదు ఏళ్లుగా ఎలాంటి రహదారి నిర్మాణాలు చేపట్టలేదని, గుంతలు పడిన ప్రతిసారి కంకర, మట్టి పోసి సరిపెట్టడం మినహా శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ రహదారులు ఇలాగే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు తరచుగా కిందపడిపోతున్నారని, మహిళలు, వృద్ధులు, పిల్లలు గాయపడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఇక వర్షం పడితే ఇది రోడ్డో, చెరువో కనిపెట్టడం కష్టమని, అసలు తాము గుంటూరులోనే ఉన్నామా? అని సందేహించాల్సిందని వారు తెలిపారు. అసలు గుంతల లోతెంతో తెలియక అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు వాపోయారు.