Highly Damaged Roads In Andhra Pradesh: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని రహదారుల్లో భారీగా ఏర్పడిన గుంతలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నా.. తట్ట మట్టి కూడా వేయని ప్రభుత్వం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రహదారుల అభివృద్ధికి అందించే ఆర్థిక సాయాన్నీ ఉపయోగించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటి కింద అందించాల్సిన నిధులను సమకూర్చక పోవటంమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. అప్పులు చేయడంలో ముందున్న జగన్ ప్రభుత్వం గుంతల రహదారులతో ప్రజల నడుములు విరుగుతున్నా నిధులివ్వడంపై దృష్టి పెట్టడం లేదు.
ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు సాయంతో రాష్ట్రంలో చేపట్టిన రహదారుల పనులే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం తన వాటి కింద అందిచాల్సిన నిధులు సక్రమంగా విడుదల చేయని కారణంగా నిర్మాణంలో పురోగతి లోపిస్తోందని ఏఐఐబీ నిపుణుల బృందమే స్వయంగా గుర్తించింది. గత ఏడాది వరకు జరిగిన పనులు, నిధుల వినియోగంపై పరిశీలించి రూపొందించిన ఏఐఐబీ నివేదికలో ఇదే విషయం ప్రస్తావించింది. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ఫలితంగా రహదారుల పనుల్లో అదే మందగమనం. అసంపూర్తి పనుల కారణంగా ఈ వర్షాకాలంలో ప్రజల అవస్థలు రెట్టింపయ్యాయి.
రాష్ట్రంలో 4 వేల 944 కోట్లతో 6 వేల 534 కిలోమీటర్ల కొత్త రహదారులు, 8 వందల 24 కిలోమీటర్ల దెబ్బతిన్న రహదారుల పునర్నిర్మాణం చేపట్టాలని టీడీపీ ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ఏఐఐబీతో ఒప్పందం చేసుకుంది. ఇందులో ఏఐఐబీ రుణం 70 శాతం అంటే 3వేల 460కోట్ల 80 లక్షలు కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 30 శాతం అంటే 14వందల 83 కోట్ల 20 లక్షలు ఇచ్చేలా అవగాహన కుదిరింది.
పనులు 2019 ఏప్రిల్‌లో ప్రారంభించి 2023 అక్టోబరు 30 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించగా, వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు ఏడు నెలలపాటు నిలిపివేసింది. తరువాత పనులకు పచ్చజెండా ఊపినా.. గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో చాలాచోట్ల పనులు నిలిచిపోయాయి. ఇప్పటికీ 350 కోట్ల వరకు బిల్లులు పెండింగులో ఉన్నాయి. మరోవైపు ఏఐఐబీ నుంచి ఇప్పటివరకు తీసుకున్న రుణానికి.. రాష్ట్ర వాటాగా ప్రభుత్వం ఎంత విడుదల చేసిందనే వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. రాష్ట్ర వాటా ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నట్లు చెబుతున్నా.. ఏఐఐబీ నుంచి మిగతా రుణం ఎందుకు విడుదల చేయడం లేదో చెప్పడం లేదు.
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళ్లవలస నుంచి గుమ్మడాం జడ్పీ రహదారి వరకు 3 కోట్ల 53 లక్షల రూపాయలు ఏఐఐబీ సాయంతో 2019లో కొత్తగా రోడ్డు నిర్మాణం చేపట్టి 20 శాతం పనులు పూర్తి చేశారు. ఇంతలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులన్నీ నిలిపేశారు. గత నాలుగేళ్లుగా పనులు చేపట్టకపోవడంతో అప్పటికే గుంతలుగా ఉన్న రహదారికి తోడు.. కొత్తగా వేసిన రోడ్డు సైతం ధ్వంసమైపోయింది.
ప్రస్తుతం వర్షాలతో రహదారి అంతా గుంతలు.. బురదమయమై ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ ఒక్క తాళ్లవలస నుంచి గుమ్మడాం జడ్పీ రహదారే కాదు.. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఏఐఐబీ సాయంతో ప్రారంభించిన రోడ్లన్నిటిదీ ఇలాంటి దుస్థితే. జగన్ ప్రభుత్వం ఈ రహదారులకు రాష్ట్ర వాటా నిధులు సరిగా విడుదల చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పనులన్నీ గత నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి.
ఉమ్మడి శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గత ప్రభుత్వ హయాంలో 174 కోట్ల రూపాయలతో 2 వందల 53 పాడైన రహదారుల పునర్నిర్మాణానికి ప్రతిపాదించారు. ఏఐఐబీ సాయంతో చేపట్టిన ఈ పనులు 2023 అక్టోబరు 30 నాటికి పూర్తి కావాల్సి ఉండగా.. నిధుల విడుదలలో జాప్యంతో నత్తనడకన సాగుతున్నాయి. వివిధ దశల్లో ఉన్న 40 పనులకు 29 కోట్లు ఖర్చు చేశారు. కాగా నెలకు 150 కోట్ల రూపాయల చొప్పున ఇస్తే 2024 డిసెంబరు నాటికి పనులు పూర్తి చేయొచ్చని ఇంజినీర్లు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది.
అధ్వానంగా తయారైన గ్రామీణ రోడ్లు