ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆక్రమణల పర్వం.. 'మడ' మనుగడకు నష్టం..! - damage to mangroves with invasions news in guntur news

తుపానులంటే కృష్ణా, గుంటూరు జిల్లా వాసులకు 1977, నవంబరు 19వ తేదీ ప్రముఖంగా గుర్తుకొస్తుంది. అప్పటివరకూ వివిధ ప్రాంతాల్లో వచ్చిన తుపానుల గురించి సినిమా థియేటర్లలో వార్తల ప్రదర్శనలో చూడటమేగాని ప్రత్యక్షంగా చూడలేదు. నాటి తుపానుకు కృష్ణాజిల్లా దివిసీమ అల్లకల్లోలమైంది. గ్రామాలకు గ్రామాలే సముద్రంలోకి కొట్టుకుపోయాయి. వందలాది మంది మృత్యువాత పడ్డారు. పశువులు, పక్షులు పెద్ద సంఖ్యలో విగతజీవులయ్యాయి. కుటుంబాలు కకావికలమయ్యాయి. కానీ, గుంటూరు జిల్లాలో మాత్రం అంత తీవ్రత కానరాలేదు. మడ అడవులు రక్షణ కవచంగా నిలవటమే అందుకు కారణం. అయితే, ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్న మడకు నేడు కొన్ని ప్రాంతాల్లో రక్షణ కరవైంది.

ఆక్రమణల పర్వం.. 'మడ' మనుగడకు నష్టం..!
ఆక్రమణల పర్వం.. 'మడ' మనుగడకు నష్టం..!

By

Published : Jun 22, 2020, 10:40 AM IST

సహజసిద్ధంగా ఏర్పడే కవచంలాటి మడ కొన్నాళ్లుగా కలప బకాసురుల గొడ్డలి వేటుకు మోడయితే.. మరికొంత భూబకాసురుల (రొయ్యల సాగుదారులు) అత్యాశకు గురై మాయమైంది. గుంటూరు జిల్లాలో ఎక్కువ భాగం అడవి సముద్ర తీరప్రాంతంలోనే ఉంది. తీరగ్రామాలు లంకెవానిదిబ్బ, రాజుకాల్వ, మోళ్లగుంట ప్రాంతంలోని 5.5 వేల హెక్టార్ల అటవీ ప్రాంతం కృష్ణా వన్యప్రాణి అభయారణ్యం పరిధిలోకి వస్తాయి. కొత్తపాలెం, దిండి, అడవులదీవి, నిజాంపట్నం, కర్లపాలెం, బాపట్ల తీరప్రాంతంలోని అటవీ ప్రాంతం 5.3 వేల హెక్టార్లు రేపల్లె అటవీ క్షేత్రాధికారి పరిధిలో ఉంది. ఇక్కడ కూడా 1977 తరువాత రొయ్యల సాగు కోసం వందలాది హెక్టార్లు మడ అడవి పరాధీనమైంది. అయితే, కృష్ణా వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో అన్యాక్రాంతమైన భూమిని 2005, 2006 ప్రాంతంలో అటవీ అధికారులు స్థానికులు, పోలీసుల సహకారంతో స్వాధీనం చేసుకుని వీఎస్‌ఎస్‌ల సహకారంతో మడ అడవి పెంపకం చేపట్టి 90 శాతం సఫలీకృతమయ్యారు. కానీ, రేపల్లె అటవీ క్షేత్ర పరిధిలోని 5.3 వేల హెక్టార్ల అటవీ భూమిలో దాదాపు నాలుగు వందల హెక్టార్ల భూమి పరాధీనంలోనే ఉంది. మిగతా భూమిలో మడ సుమారు 1500 హెక్టార్లలోపే ఉంది. మడ అభివృద్ధి కోసం ప్రభుత్వం గడిచిన పదేళ్లల్లో దాదాపు రూ.10 కోట్లతో మొక్కల పెంపకం చేపట్టినా అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా లక్ష్యానికి చేరువకాలేదని స్థానికులే పేర్కొంటున్నారు.

రక్షణ కవచంలా.. జీవవైవిధ్యానికి ఆవాసంలా..

తుపానులు, సునామీ వంటి విపత్తులు వచ్చినప్పుడు తీర భూభాగం కోతకు గురికాకుండా ఉండేలా మడ చెట్లు అడ్డుకుంటాయి. ఇవి ఎక్కువగా నదులు, కాల్వలు సముద్రంలో కలిసే చోట ఉప్పు, తీపినీరు కలిసే ప్రాంతంలో ఎక్కువగా సహజసిద్ధంగా పెరుగుతాయి. మొక్క కంటే వేర్లు వృద్ధి చెంది నేలలో నీటిలో వలలా అల్లుకు పోయి బలమైన ఇనుప చట్రంలా మారుతాయి. దీనిద్వారా అలలు, తుపాను, సునామీలను అడ్డుకుంటాయి. మొక్కలపై భాగాన్ని వివిధ రకాల పక్షులు ఆవాసం ఏర్పాటు చేసుకోవటం వల్ల చేపలు, రొయ్యలు వాటి రెట్టను ఆహారం తీసుకునేందుకు మొక్కల కిందికి చేరతాయి. అలల నుంచి రక్షణ ఉండటంతో అక్కడే గుడ్లు పెడతాయి. దీనివల్ల మత్స్య సంపద వృద్ధి చెందుతుంది.

ఆక్రమణల పర్వంతో జీవ వైవిధ్యం కూడా దెబ్బతింటోంది. నీటి కుక్క, జంగుపిల్లి, తెల్ల కొంగ, ఎర్రకాళ్ల కొంగ, గూడ కొంగ, సముద్రపు కాకి, నారాయణ పక్షి, ఫ్లెమింగో పక్షి, తాబేలు, నత్తలు, మొసళ్లు తదితర జీవులు మనుగడ కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి.

ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం

2018 - 2019లో 85 హెక్టార్లలో మొక్కల వృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రేపల్లె అటవీ క్షేత్రాధికారి రమేష్​ తెలిపారు. ఈ ఏడాది 12 హెక్టార్లలో విత్తనాలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. మడ అడవుల ఆక్రమణలను అడ్డుకుంటామని.. అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి..

ఉపాధ్యాయ బదిలీలకు ముందే.. సర్దుబాటు

ABOUT THE AUTHOR

...view details