ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Murder: పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగానే హతమార్చాడు..!

గుంటూరులో ఓ దళిత విద్యార్థిని దారుణ హత్య కలకలం రేపింది. స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్న వేళ పట్టపగలే నడిరోడ్డుపై జనం చూస్తుండగానే బీటెక్‌ విద్యార్థిని రమ్యను (20) శశికృష్ణ (24) అనే యువకుడు కత్తితో పొడిచి అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఈ ఘటనతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దిశ చట్టం కింద నిందితుడికి శిక్ష పడేలా చూడాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

ramya murder
ramya murder

By

Published : Aug 16, 2021, 5:08 AM IST

Updated : Aug 16, 2021, 6:52 AM IST

అంతటా స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్న వేళ.. గుంటూరులో ఓ దళిత విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. పట్టపగలే నడిరోడ్డుపై జనం చూస్తుండగానే బీటెక్‌ విద్యార్థిని రమ్యను (20) శశికృష్ణ (24) అనే యువకుడు కత్తితో పొడిచి అత్యంత పాశవికంగా హతమార్చాడు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారిలో పరమయ్యగుంట సెంటరువద్ద ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. నిందితుడు శశికృష్ణను ఆదివారం రాత్రి అతడి స్వగ్రామం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమ్య హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని, ‘దిశ’ కింద చర్యలు తీసుకొని నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.

పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగానే హతమార్చాడు..!

విచక్షణారహితంగా దాడి..

గుంటూరుకు చెందిన నల్లపు వెంకట్రావు, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రమ్య (20) చేబ్రోలు మండలంలోని ఓ మైనారిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నారు. అక్క మౌనికతోపాటు గుంటూరు పరమయ్యగుంటలో నానమ్మ ఇంటివద్ద ఉంటున్నారు. రమ్యకు వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన శశికృష్ణతో ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహమేర్పడింది. హత్య సంఘటనకు ముందు వారిద్దరు పరమయ్యగుంట వద్ద హోటల్‌ సమీపంలో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదమేర్పడింది. యువతి ఇంటికి వెళ్లటానికి ప్రయత్నించగా శశికృష్ణ ఆమె చేయి పట్టుకుని లాగి కత్తితో విచక్షణారహితంగా పొడిచి పారిపోయాడు. దీని సీసీ ఫుటేజీ పోలీసులకు లభ్యమైంది. నిందితుడిని అతడి సొంతూరు ముట్లూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో నిందితుడు చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా అడ్డుకుని గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. యువతీయువకుల మధ్య వాగ్వాదానికి కారణాలేమిటి? ఎన్నాళ్లనుంచి పరిచయముందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సీసీటీవీలో నమోదైన హత్య దృశ్యాలు..

ఎవరూ అడ్డుకోలేదు..

నిందితుడు కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడినా స్థానికులెవరూ అడ్డుపడలేదని, ఓ వృద్ధురాలు వారించబోతుండగా అప్పటికే పొడిచి పరారైనట్లు చెబుతున్నారు. యువతి శరీరంపై గొంతు భాగంలో ఒకటి, ఛాతీపై ఒకటి, పొట్ట భాగంలో మూడు కత్తిపోట్లున్నట్లు వైద్యులు, పోలీసు వర్గాలు తెలిపాయి. పాత గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రమ్య సెల్‌ఫోన్‌ను వారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శశికృష్ణ సెల్‌ఫోన్‌కు ముట్లూరు నుంచి కాల్స్‌ వచ్చాయని తేలింది. అవి చేసిన యువకులను పోలీసులు విచారించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా హత్యకు శశికృష్ణే తెగబడినట్లు నిర్ధారించుకున్నారు. హత్య విషయం తెలిసే సమయానికి బాధితురాలి తల్లిదండ్రులు చర్చిలో ఉన్నారు. కుమార్తెపై దాడి విషయం తెలియడంతో ఆసుపత్రికి వచ్చి భోరున విలపించారు.

అతడిది ఆకతాయి నేపథ్యం!

శశికృష్ణ చేబ్రోలులో తొమ్మిదో తరగతి చదివాడు. యువకుడి తల్లిదండ్రులు కుటుంబ కలహాలతో వేర్వేరుగా ఉంటున్నారు. తండ్రి గురవయ్య ముట్లూరులో, తల్లి నరసరావుపేటలో నివసిస్తున్నారు. శశికృష్ణ ఇద్దరి వద్దకు వెళుతూ ఉంటాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. నిందితుడు ఈ గ్రామాల్లో ఎవరితో సరిగా మాట్లాడడని, ముభావంగా ఉంటాడని.. ఎవరైనా ఏదైనా అంటే గొడవపడతాడని చెబుతున్నారు. ఆకతాయి చేష్టలతో పాటు చిల్లరగా తిరుగుతాడని తెలిసింది. శనివారం రాత్రి ఊళ్లో ఓ ట్రాక్టరు నుంచి ఇంధనం దొంగిలిస్తుండగా గుర్తించి చేయి చేసుకున్నారని తెలుస్తోంది. గురవయ్యతో పాటు యువకుడి స్నేహితులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడికి ఉరే సరి: హోంమంత్రి

విషయం తెలిసిన వెంటనే జీజీహెచ్‌కు వచ్చా. 'రమ్య హత్య బాధాకరం. విషయం తెలుసుకుని ముఖ్యమంత్రి చలించిపోయారు..నిందితుడికి ఉరే సరైన శిక్షగా భావిస్తున్నాం' _హోంమంత్రి సుచరిత

అనంతరం ఆసుపత్రిలోనే ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌, అధికారులతో భేటీ అయ్యారు. నిందితుడిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

‘రాష్ట్రంలో మహిళలపై తరచూ అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. నేరాలు చేసేవాళ్లకు భయం లేకుండా పోయింది’ అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. జీజీహెచ్‌లో మృతురాలి కుటుంబీకులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

వైకాపా ప్రభుత్వంలో దళితులపై అత్యాచారాలు, హత్యలు కొత్త కాదని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌ కుమార్‌ ధ్వజమెత్తారు.

సంబంధిత కథనం:

Murder Video CC Footage: బీటెక్ విద్యార్థిని దారుణ హత్య.. సీసీ కెమెరాలో దృశ్యాలు!

Last Updated : Aug 16, 2021, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details