ఇంటర్ వరకు విద్యార్థులకు కావాల్సిన పూర్తి సమాచారం విద్యాసంస్థలే అందిస్తాయి. డిగ్రీ, బీటెక్‌లలో అలా కాదు. ల్యాబ్స్ నుంచి యూనివర్శిటీ నిర్వహించే పరీక్షల వరకు ఎలాంటి ప్రశ్నలు వస్తాయో తెలీదు. స్డడీ మెటీరియల్స్ లభించడం చాలా కష్టం. అందుకోసం.. విద్యార్థులు యుద్ధమే చేస్తుంటారు. ఆ సమస్యకు పరిష్కారంగా.. డిగ్రీ స్థాయి విద్యార్థులకు కావాల్సిన సమస్త విద్యా సమాచారం అందించే ఎడ్యుకేషన్ పోర్టల్ ఏర్పాటు చేశారు.. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట యువకులు.
వెబ్‌సైట్ తయారు చేసిన యువకులు
గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సాయి శరత్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. చదువుకునే సమయంలో అందరిలానే పరీక్షలకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలో.. వివిధ కళాశాలల్లో నిర్వహించే టెక్ సెమినార్లకు వెళ్లాడు. అక్కడ, ఆన్‌లైన్ వెబ్‌సైట్ల నిర్వహణ ద్వారా విద్యార్థుల చెంతకే సమాచారాన్ని ఎలా అందించవచ్చో తెలుసుకున్నాడు. ఆ తరువాత.. జేఎన్‌టీయూ పరిధిలో ఉండే అన్ని కళాశాలల్లోని విద్యా సమాచారాన్ని సేకరించాడు. మిత్రుడు కుమారస్వామితో కలిసి జేఎన్‌టీయూ ఫాస్ట్ అప్‌డేట్స్ అనే వెబ్‌సైట్ తయారుచేశాడు.
వారి వెబ్‌సైట్ కు మంచి ఆదరణ లభించింది. ఆ ప్రోత్సాహంతో ప్రాంగణ నియామకాల్లో వచ్చిన ఉద్యోగం వదులుకుని.. 2019లో సైవేర్ టెక్నాలజీస్ సంస్థను ఏర్పాటు చేశారు.. శరత్, కుమారస్వామి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు టైం టేబుల్స్, పరీక్ష ఫలితాలు, పాత ప్రశ్నాపత్రాలు, నోటిఫికేషన్లు, ఇతర మెటీరియల్ అందిస్తున్నారు. వీరు అభివృద్ధి చేసిన ఆండ్రాయడ్ యాప్‌ను 70 వేలకు మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్లే స్టోర్‌లో ఆ యాప్‌కు ఫోర్ స్టార్ రేటింగ్ లభించింది.
రోజు లక్ష మందికి పైగా వీక్షణ
ఈ వెబ్‌సైట్‌ను రోజూ లక్ష మందికిపైగా చూస్తున్నారు. ఫేస్‌బుక్‌లో రెండున్నర లక్షల మందికిపైగా అనుసరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి తరహా వైబ్‌సైట్లలో తమ వెబ్‌సైట్ ముందు వరసలో ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.. కుమారస్వామి. ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో వెళ్లడం కంటే.. ఇంటి వద్దే పదిమందికి ఉద్యోగాలు కల్పించడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు.