మూడు పదులు దాటినా పెళ్లికాని, పెళ్లి అయినా విడాకులు తీసుకుని రెండో పెళ్లి కోసం ఎదురు చూసేవారిని సైబర్ నేరస్థులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. నకిలీ వివాహ పరిచయ వేదికలను ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. తీరా మోసపోయిన కొందరు బాధితులు కేసులు పెట్టడం లేదు. పోలీసు అధికారులతో పరిచయాలున్నవారు మాత్రం తమకు సాయం చేయమని కోరుతున్నారని నగర సైబర్‌క్రైమ్ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్ తెలిపారు. అపరిచితులతో వ్యక్తిగత విషయాలు.. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బాధితులు టోల్‌ఫ్రీ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
ఆశ చూపి.. సొమ్ము కొట్టేసి:సైబర్ నేరగాళ్లు వివాహ పరిచయ వేదికలను అడ్డాగా చేసుకుని తమ వద్ద పనిచేసే టెలీకాలర్స్‌ను పెళ్లికూతుళ్లుగా పరిచయం చేస్తారు. కాఫీక్లబ్‌లు, పార్కుల్లో పెళ్లిచూపులు నిర్వహిస్తారు. ఆ అమ్మాయిలు అబ్బాయిల ఫోన్ నంబర్లు తీసుకుని ఛాటింగ్ ప్రారంభిస్తారు. బహుమతులు, పాకెట్‌మనీ, కుటుంబ అవసరాల పేరిట వీలైనంత పెద్దమొత్తంలో గుంజుతారు. కొద్దిరోజుల తరువాత అభిరుచులు, ప్రవర్తన నచ్చలేదంటూ యువకులకు ఫోన్ చేసి చెబుతారు.
అవతలి వైపు నుంచి గట్టిగా నిలదీస్తే లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయిస్తామంటూ బెదిరిస్తారు. సరూర్‌నగర్‌లో ఓ వివాహ పరిచయ వేదిక నిర్వాహకులు కూకట్‌పల్లికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి రూ.లక్షన్నర వసూలు చేసినట్టు ఫిర్యాదు చేయటంతో ఈ గుట్టు వెలుగు చూసింది.