ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మీ ఖాతాలో డబ్బు పడింది.. వెనక్కు పంపిస్తారా అంటూ లింక్‌.. క్లిక్‌ చేస్తే అంతే.! - Hyderabad

Cyber Fraud: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైబర్ నేరగాళ్లు పంథాను మార్చుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. ఉద్యోగం, బంపర్‌డ్రా, బహుమతులు, పెట్టుబడులతో లాభాలంటూ వల విసిరే సైబర్‌ నేరగాళ్లు.. తాజాగా మరో కొత్త తరహా మోసానికి తెరలేపుతున్నారు. వెబ్ లింకుల పేరుతో బురిడీ కొట్టించి.. ఖాతాలో ఉన్నకాడికి దోచేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల పోలీసులు ముందస్తుగా హెచ్చరికలు చేస్తున్నారు.

Cyber Crime
సైబర్ నేరాలు

By

Published : Oct 24, 2022, 6:01 PM IST

Cyber Fraud: హైదరాబాద్‌ మల్కాజిగిరికి చెందిన ఓ మహిళ బ్యాంకు ఖాతాలో ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు రూ.10 వేలు జమ చేశారు. అనంతరం ఓ వ్యక్తి ఫోన్‌ చేసి వేరొకరికి బదులు మీ బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేశానని.. తిరిగి పంపాలని కోరాడు. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఓ లింకు ద్వారా నేరుగా పంపొచ్చని సందేశం పంపాడు. నమ్మిన మహిళ లింకు నొక్కినా డబ్బు పంపడం వీలుకాలేదు. కొన్ని గంటల తర్వాత ఆ వ్యక్తి ఫోన్‌ చేసి.. ‘మీ ఫొటోలు నా దగ్గర ఉన్నాయి. నేను అడిగినంత ఇవ్వకపోతే నగ్నంగా మారుస్తా’ అంటూ బెదిరించాడు. ఆ మహిళ పోలీసుల్ని ఆశ్రయించారు.

ఉద్యోగం, బంపర్‌డ్రా, బహుమతులు, పెట్టుబడులతో లాభాలంటూ వల విసిరే సైబర్‌ నేరగాళ్లు ఇలా కొత్త తరహా మోసానికి తెరలేపుతున్నారు. పొరపాటున మోసగాడు పంపిన లింకును క్లిక్‌ చేస్తే ఫోన్‌ గ్యాలరీలోని ఫొటోలు, వీడియోలన్నీ అతడికి చేరిపోతాయి. ఇక అక్కడి నుంచి ఆట మొదలవుతుంది. అడిగినంత ఇవ్వకపోతే.. ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామంటూ బెదిరింపులు ప్రారంభమవుతాయి.

స్థానిక భాషలతో మాట్లాడుతూ నమ్మించి..డబ్బు చెల్లిస్తే డేటా ప్రొవైడర్ల ద్వారా లక్షలాది మంది వ్యక్తిగత డేటా ఇట్టే దొరుకుతోంది. అదే సైబర్‌ నేరగాళ్ల బలం. ముందుగా ఆయా వ్యక్తుల పేర్లు, ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతా సహా పుట్టుపూర్వోత్తరాలన్నీ సేకరిస్తున్నారు. ఈ వివరాలతో స్థానిక భాషల్లో మాట్లాడుతూ వంచిస్తున్నారు. డబ్బు కోసం నేరగాళ్లు పంపించే నకిలీ లింకు క్లిక్‌ చేయగానే.. ఫోన్లోకి వైరస్‌ చొరబడుతుంది. గ్యాలరీ, కాంటాక్ట్‌ లిస్టు సహా డేటా మొత్తం నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఆ తర్వాత ఫొటోలు ఉన్నాయంటూ బెదిరింపులకు దిగుతున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు..

* పొరపాటున మీ ఖాతాలో డబ్బు జమ అయ్యిందని.. తిరిగి ఇవ్వాలని గుర్తు తెలియని వ్యక్తులు పంపించే లింకుల్ని నమ్మకూడదు.

* ఏ బ్యాంకయినా వెబ్‌ లింకుల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించదు.

* మీ ఖాతాలో గుర్తు తెలియని వ్యక్తి పొరపాటున డబ్బు జమ చేస్తే.. తిరిగి ఇచ్చేందుకు బ్యాంకుకు వెళ్లి వారిచ్చిన ఖాతాలో జమ చేయాలి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details