CS JAWAHAR COMMENTS ON CM JAGAN DELHI TOUR: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ వేగం పెంచిన వేళ.. సీఎం జగన్ ముందుగా అనుకున్న విదేశీ పర్యటన రద్దు చేసుకున్నారనే వార్తల నేపథ్యంలో,.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి మీడియా సమావేశం..ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అంశాలపై ఉన్నతస్థాయిలో మాట్లాడేందుకు గత నెలలో ముఖ్యమంత్రి దిల్లీ వెళ్లారని.. ఇప్పుడు మరోమారు దిల్లీకి ఆయన వెళ్లనున్నట్టు జవహర్ రెడ్డి వెల్లడించారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ దిల్లీకి వెళ్తారని స్పష్టం చేశారు. దీని కోసం ఆయన తన వ్యక్తిగత పర్యటనను కూడా వాయిదా వేసుకున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర విభజన అంశాలపై కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీతో భేటీ కోసం ఏపీ నుంచి సీఎస్ నేతృత్వంలోని కమిటీ దిల్లీ వెళ్తున్నట్టు ఆయన తెలిపారు. రెవెన్యూ లోటు సహా పోలవరం , తెలంగాణ నుంచి జెన్కోకు రావాల్సిన బకాయిల విషయంలోనూ కేంద్రంతో జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయని.. తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నందున తన నేతృత్వంలో ఆర్థిక శాఖ సహా కొన్ని కీలకమైన శాఖల కార్యదర్శులు దిల్లీకి వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఈ అంశాల్లో ఉన్నతస్థాయిలో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి దిల్లీలో ఉండటం అవసరమని భావిస్తున్నట్టు తెలిపారు. కార్యదర్శుల స్థాయిలో తాము వెళ్లినా.. ముఖ్యమంత్రి జగన్ కూడా దిల్లీలో ఉంటే మేలని వెల్లడించారు.
గతంలో రెవెన్యూ లోటు ముగిసిన అధ్యాయం అని ప్రకటించినా .. మళ్లీ కేంద్రం దీన్ని పునరాలోచించాలని నిర్ణయించిందన్నారు. దీంతో పాటు పోలవరం అంశంపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ కూడా ఉంటే తుది నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశముందని ఆయన తెలిపారు.