ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Joint Staff Council Meeting: ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు: జవహర్ రెడ్డి - ఏపీ ఎన్జీఓ నేత బండి శ్రీనివాసరావు

Jawahar Reddy on Joint Staff Council Meeting: ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. ఉద్యోగుల వేతన సవరణకు 12వ పీఆర్సీని నియమించామని అన్నారు. అదే విధంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ఏపీ ఎన్జీఓ నేత బండి శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేశారు.

Joint Staff Council Meeting
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం

By

Published : Jul 13, 2023, 9:42 PM IST

Jawahar Reddy on Joint Staff Council Meeting: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 341 డిమాండ్లను పరిష్కరించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ సహా వివిధ శాఖల అధికారులు సమావేశం అయ్యారు. పెండింగ్​లో ఉన్న అంశాలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల డిమాండ్ల సత్వర పరిష్కారానికి.. గత ఆరేడు నెలలుగా ఉద్యోగ సంఘాలతో తరచూ చర్చించడం జరుగుతోందన్నారు.

ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. కరోనాతో చనిపోయిన ఉద్యోగుల స్థానంలో.. వారి కుటుంబాలకు చెందిన వారికి కారుణ్య విధానంలో 1042 ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని.. ఆ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి మాజీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో 12వ పీఆర్సీ కూడా నియమించామని అన్నారు.

ఏడెనిమిది సంవత్సరాల తర్వాత పూర్తిస్థాయి సమావేశం..: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మొట్టమొదటి సారిగా గ్రీవెన్స్ డేలను నిర్వహించాలని ఉత్తర్వులు ఇవ్వడం సంతోషమని ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఏడెనిమిది సంవత్సరాల తర్వాత పూర్తిస్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగిందన్నారు. ఇకపై ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.

జీతాలు, పింఛన్లు సకాలంలో 1వ తేదీన చెల్లించాలని కోరామన్నారు. ఆర్ధిక శాఖ అనుమతిలేని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా ఆప్కాస్​లో చేర్చాలని సూచించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం సంతోషమన్న ఆయన.. 2014 జూన్​ 2వ తేదీ నాటికి ఉద్యోగంలో చేరిన కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలని కోరారు. సచివాలయల్లో మహిళా పోలీసులుగా పని చేయడం ఇష్టంలేని వారిని మహిళా కార్యదర్శులుగా కొనసాగించాలని తెలిపారు.

బకాయిలు క్లియర్ చేయమన్నాం: 40 ఏళ్ల చరిత్రలో తొలిసారి చాలా గొప్ప జాయింట్ కౌన్సిల్ సమావేశం జరిగిందని ఏపీ ఎన్జీఓ నేత బండి శ్రీనివాసరావు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మినెంట్ ప్రక్రియ 40 రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరామన్నారు. పోలీసులకు, ఉద్యోగులకు సరెండర్ లీవులు 800 కోట్లు పెండింగ్ ఉందని.. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఆ బకాయిలు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. 2004కు ముందు అపాయింట్ అయిన వారికి ఓపీఎస్ అమలు చేయమని కోరామని వెల్లడించారు. మన్మోహన్ సింగ్​ను పీఆర్సీ కమిషన్ ఛైర్మన్​గా నియమించడం సంతోషదాయకమన్నారు.

జీపీఎస్ ఉత్తర్వులు ఇచ్చే ముందు ఉద్యోగ సంఘాలతో చర్చించాలి: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో 18 శాఖల అధికారులు పాల్గొన్నారని ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం నేత కె. వెంకటరామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేసిన జీపీఎస్ ప్రతిపాదన గతంలో కంటే బాగుందనే సమర్థించామని పేర్కొన్నారు. జీపీఎస్ ఉత్తర్వులు ఇచ్చే ముందు ఉద్యోగ సంఘాలతో చర్చించాలని కోరామన్నారు. అందుకు సీఎస్ అంగీకరించారన్నారు. జగన్న లేఅవుట్​లలో ఇచ్చిన స్థలం కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్స్​లో ఉద్యోగులకు వంద ఎకరాలు ఇళ్ల స్థలాలకు కేటాయించాలని కోరామన్నారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్​కు ప్రభుత్వ స్కీంలు ఇవ్వాలని, జీతాలు పెంచాలని కోరామని తేలిపారు.

ABOUT THE AUTHOR

...view details