Crops Dying Due to No Irrigation Water From Sagar :సాగర్ ఆయకట్టు.. ఈ పేరు చెప్పగానే పచ్చని పైర్లు, పరవళ్లు తొక్కే పంట కాలువలు, మేలైన దిగుబడులే గుర్తుకు వస్తాయి. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం ఆయకట్టు ప్రాంతానికి నీరు అందక పొలాలన్నీ ఎండిపోతున్నాయని గుంటూరు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట కళ్ల ముందే నాశనం అయిపోతుందని వాపోతున్నారు. పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
No Water in Krishna River :ఏపుగా పెరిగి పూత, పిందె, కాయతో దిగుబడికి సిద్ధంగా ఉన్న పత్తి.. ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్న మిరప, పొట్ట దశలో ఉన్న వరి.. నీటి జాడ కోసం ఆతృతగా ఎదురుస్తున్నాయి. సాగర్ ఆయకట్టు పరిధిలో ఒకప్పుడు నీటికి ఢోకా ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కృష్ణా నదిలో నీరు లేక.. సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయలేదు. వర్షాలు సైతం ముఖం చాటేయ్యడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Guntur District Farmers Worried About Crops :గుంటూరు జిల్లాలో ప్రత్తి, మిరప, వరి పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి. తాగునీటి అవసరాలకు చెరువులను నింపేందుకు నీటిపారుదలశాఖ అధికారులు సాగర్ కుడి కాలువకు నీరు వదలగా వాటిల్లో కొంత పంటలకు మళ్లించుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. కిలోమీటర్ల మేర పైపులు వేసి మోటార్లు, ట్రాక్టర్లతో తోడుకుంటున్నారు. వాగులు, కుంటల్లో నిల్వ ఉన్న నీటిని సైతం పంటపొలాలకు మళ్లించుకుంటున్నామని రైతులు వాపోతున్నారు.