ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎం బటన్ నొక్కినా.. అందని పంటల బీమా.. ఆవేదనలో రైతులు

By

Published : Feb 18, 2023, 10:24 AM IST

Farmers not Getting Crop Insurance: ఎన్నో ఆశలు పెట్టుకుని.. బీమా వస్తుందని ఎదురుచూసిన రైతులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. రాష్ట్రంలోనే మిరప అత్యధికంగా సాగయ్యే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మొత్తం సాగులో కేవలం 18 శాతానికే బీమా కల్పించారు. 82 శాతం విస్తీర్ణంలో సాగైన పంటకు నష్టం జరిగితే.. పైసా కూడా ఇవ్వలేదు. తమకు బీమా లేదనే విషయం కూడా రైతులకు తెలియదు. సీఎం హామీ ఇచ్చారని ధీమాగా ఉన్న రైతులు.. తీరా బటన్ నొక్కిన తరువాత డబ్బులు రావడం లేదు.

Crop insurance
పంటల బీమా

అందరికీ అందని బీమా

Farmers not Getting Crop Insurance: ఈ-క్రాప్‌లో నమోదైతే ఉచిత బీమా వర్తిస్తుందన్నది ఒట్టిమాటే. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 5.43 లక్షల ఎకరాల్లో మిరప సాగవగా.. ఉచిత బీమా చేసింది 3.29 లక్షల ఎకరాలకే. అంటే 61 శాతం లోపే. మిగిలిన 39 శాతం మిరప రైతులకు.. తమకు బీమా లేదనే సంగతి కూడా తెలియదు. రాష్ట్రంలోనే మిరప అధికంగా సాగయ్యే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పరిస్థితి మరీ దారుణం. మొత్తం సాగులో కేవలం 18 శాతానికే బీమా కల్పించారు. దీనివల్ల 82 శాతం విస్తీర్ణంలో సాగైన పంటకు నష్టం జరిగితే.. పైసా కూడా పరిహారం అందని దుస్థితి. సీఎం మాటలపై నమ్మకంతో తమకూ పంటల బీమా వర్తిస్తుందని రైతులు భావిస్తున్నా.. తీరా సీఎం బటన్‌ నొక్కాక వారికి సొమ్ములు అందడం లేదు.

రైతుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోంది. పంటల బీమాలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, రైతులు పైసా చెల్లించాల్సిన పనిలేకుండా వారి తరఫున ప్రీమియం మొత్తాన్ని తామే చెల్లిస్తున్నామని, ఈ-క్రాప్‌లో నమోదైన ప్రతి ఎకరాకూ వర్తింపజేస్తున్నామని.. మూడేళ్లుగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వల్లె వేస్తున్నారు. కానీ ఈ-పంటలో నమోదైన వారందరి పంటలకు బీమా వర్తింపజేయడం లేదు. వర్షాధారం, సాగునీటి వసతి, దిగుబడి, వాతావరణ ఆధారితం అంటూ వివిధ నిబంధనల పేరిట కోత పెట్టి.. కొంత విస్తీర్ణానికే అమలు చేస్తున్నారు.

రాష్ట్రంలోనే మిరప అధికంగా సాగయ్యే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ ఏడాది 82 శాతం విస్తీర్ణాన్ని పక్కనబెట్టి.. కేవలం 18 శాతం విస్తీర్ణానికి పంటల బీమా వర్తింపచేశారు. కర్నూలు జిల్లాలోనూ 36 శాతం విస్తీర్ణంలో మిరప వేసిన రైతులకు ఉచిత పంటల బీమా లేదు. ఆ సంగతి కూడా వారికి తెలియదు. 2020-21, 2021-22 సంవత్సరాల్లో రబీకి పంటలకు బీమాను ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టేసింది. సర్కారు బీమా లెక్కలేమిటో, నష్టం అంచనాకు ప్రామాణికత ఏమిటో.. ఆ రంగంలోని నిపుణులకు కూడా అంతుపట్టడం లేదు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగునీటి వసతి కింద మిరప వేస్తుంటే.. దాన్ని వర్షాధారం కిందకు తేవడం ప్రభుత్వ కుదింపు ధోరణికి అద్దం పడుతోంది. అందుకే గత రెండు సంవత్సరాలుగా పంట నష్టపోయిన చాలా మంది రైతులకు పరిహారం అందడం లేదు. ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించకపోగా, రైతులు సొంతంగా ప్రీమియం చెల్లించుకుంటే పరిహారం వచ్చే అవకాశమున్నా.. అదీ లేకుండా చేస్తోంది. ఈ-క్రాప్‌ చేసిన ప్రతి ఎకరాకూ బీమా వర్తింపజేయడం లేదనే అంశాన్ని దాస్తోంది. 2021 ఖరీఫ్‌లో రైతులకు 2 వేల 977.82 కోట్ల పరిహారం చెల్లించామని గొప్పగా చెబుతోంది. భారీ వర్షాలు, వరదలు, పురుగు, తెగుళ్లు, నల్లతామరతో రైతులకు అంతకుమించిన నష్టం ఎదురైందనే అంశాన్ని కావాలనే విస్మరిస్తోంది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మిరపను వర్షాధార పంటగా నోటిఫై చేయడం ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోంది. నిజానికి ఈ జిల్లాలో 99 శాతం మిరప సాగునీటి ఆధారంగానే పండిస్తారు. హైబ్రిడ్‌ రకాలతో పాటు అధిక మొత్తంలో పెట్టుబడి పెడతారు. కొన్నేళ్లుగా వాతావరణ ఆధారిత బీమా కిందే అమలు చేస్తున్నా... ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. 2020 ఖరీఫ్‌ నుంచి మాత్రమే వర్షాధార పంటగా పేర్కొంటున్న ప్రభుత్వం... పరిహారానికి కావాలనే మోకాలడ్డుతోందని రైతులు వాపోతున్నారు. కర్నూలు జిల్లాలో సాగునీటి వసతి ఉన్న పంటను బీమా కిందికి తెచ్చారు. అక్కడ వర్షాధారంగా పండించే 43వేల ఎకరాలకు మాత్రం మొండిచెయ్యి చూపారు.

గతేడాది నుంచి నల్లతామర ఆశించడంతో దిగుబడులు పూర్తిగా పడిపోయాయి. 80 శాతం పంట దెబ్బతింది. అయినా సాగునీటి వసతి కింద 1.09 లక్షల ఎకరాలు, వర్షాధారం కింద 18వేల 593 ఎకరాలకే పరిహారం ఇచ్చారు. పంట దెబ్బతిన్నప్పటికీ అధికశాతం రైతులకు రూపాయి కూడా అందలేదు. ఈ ఏడాది మొత్తం సాగులో 39 శాతం విస్తీర్ణానికి బీమా కల్పించలేదు. ఇప్పటికే నల్లతామరతో నష్టం మొదలైనా.. పరిహారం పొందే అవకాశం లేకుండా పోయింది. అత్యధికంగా పల్నాడు జిల్లాలో 1.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిరప పంట వేస్తారు. గతేడాది వర్షాధారం కింద వేసిన 12వేల 976 ఎకరాలకు మాత్రమే 5.47 కోట్ల పంటల బీమా అందింది. ఈ ఏడాది.. ఈ జిల్లాలో 18 వేల ఎకరాలకు మాత్రమే పంట బీమా వర్తింపజేస్తున్నారు. 1.19లక్షల ఎకరాల్లో మిరప పంట వేసిన రైతులకు బీమా లేదు.

గుంటూరు జిల్లాలో 34 వేల ఎకరాల్లో మిరప సాగవుతోంది. గతేడాది 7వేల 97 ఎకరాలకే పరిహారం అందింది. ఈ ఏడాది 12వేల ఎకరాలకు మాత్రమే అమలవుతోంది. బాపట్ల జిల్లాలో మొత్తం 27వేల ఎకరాల సాగు ఉంటే... 3వేల 222 ఎకరాలకే వర్తింపజేశారు. మిరప సాగులో రెండో స్థానంలో ఉండే కర్నూలు జిల్లాలో 1.22 లక్షల ఎకరాల్లో పంట వేయగా.. బీమా చేసిన విస్తీర్ణం 79వేల 475 ఎకరాలు మాత్రమే. మొత్తం 21 జిల్లాల్లో మిరప సాగవుతుండగా.. అందులో తక్కువ విస్తీర్ణంలో పండించే 13 జిల్లాల్లో బీమా వర్తింపజేయలేదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details