ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Crimes in Andhra Pradesh: ఏపీ నేరగాళ్లకు అడ్డాగా మారుతోందా.. పోలీసులు ఏం చేస్తున్నట్టు..? - Rowdy Gangs in ap

Crimes in Andhra Pradesh: పోలీస్‌ అంటే కనిపించని నాలుగో సింహమని అంటారు. రాష్ట్రంలో నిజంగానే నాలుగో సింహం కనిపించడం లేదు. అధికార పార్టీ బోనులో బందీగా మారిపోయి నేరగాళ్లపై గర్జించలేకపోతోంది. అధికార అండతో రౌడీషీటర్లు రెచ్చిపోతుంటే.. కట్టడి చేయాల్సిన పోలీస్‌ వ్యవస్థ.. చేతులు కట్టేసుకుంది. గస్తీని గాలికొదిలేసి రాజకీయ పోలీసింగ్‌లో తరిస్తోంది. అసలు రాష్ట్రంలో పోలీసులంటే నేరగాళ్లకు భయం ఉందా? ఉంటే రోజూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సంతకం పెట్టాల్సిన రౌడీషీటర్ ఏకంగా ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్‌ చేస్తాడా? గడచిన పక్షం రోజులుగా చోటుచేసుకున్న నేరాలు ఏం చెప్తున్నాయి.?

Crimes in Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు

By

Published : Jun 17, 2023, 9:20 AM IST

Crimes in Andhra Pradesh: ఏపీ నేరగాళ్లకు అడ్డాగా మారుతోందా.. పోలీసులు ఏం చేస్తున్నట్టు..?

Crimes in Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే పూర్ణచంద్రపై ఫిర్యాదుచేసిందుకు.. ఆ మరుసటిరోజే వైసీపీ గిరిజన ఎంపీపీపై హత్యాయత్నం. మరోచోట ఓ వ్యక్తిపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అభిమానుల దాడి. ఇక కొద్దిరోజుల క్రితం టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఇంటిపైకి పట్టపగలే కర్రలతో దాడికి యత్నించారు. తాజాగా విశాఖ ఎంపీ సత్యనారాయణ భార్య, కుమారుడితో పాటు ఆయన ఆడిటర్​ను రౌడీషీటర్లు 48 గంటలపాటు బంధించి కొట్టారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇంకెత దిగజారుతాయోననే ఆందోళనకు దారితీస్తోంది.

గతేడాది జూన్‌లో.. స్థిరాస్తి వ్యాపారి రామకృష్ణను అపహరించినప్పుడే రౌడీషీటర్‌ హేమంత్‌కు కళ్లెంవేసి ఉంటే.. ఎంపీ కుటుంబానికి కిడ్నాప్ కష్టం తప్పేదేమో. అదే హేమంత్‌ వంటి రౌడీషీటర్లు.. పదేపదే రెచ్చిపోవడానికి అవకాశంగా మారింది. రాష్ట్రంలో అరాచక శక్తులకు లైసెన్స్ ఏమైనా ఉందా అనేంతగా.. నేరాలు కలవరపరుస్తున్నాయి. గడచిన 16 రోజుల్లో చోటుచేసుకున్న నేరాలు-ఘోరాలు.. దిగజారుతున్న శాంతిభద్రతలకు నిదర్శనంగా.. నిలుస్తున్నాయి.

Rowdy Gangs in Visakhapatnam: విశాఖ.. ఆర్థిక రాజధానా.. అరాచక శక్తుల రాజధానా?

విజయనగరం జిల్లా పూసపాటిరేగలో.. జాతీయ రహదారిపై కారులో వెళ్తున్న ఓ వ్యాపారిని తుపాకీతో బెదిరించి, కళ్లల్లో కారంకొట్టి.. రూ.50 లక్షలు దోచుకున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెంలో.. టీడీపీ నాయకుడి భార్య హనుమాయమ్మను ట్రాక్టర్‌తో గుద్దిచంపారు. ఆస్పత్రిలో ఉన్న సోదరిని చూసేందుకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వచ్చిన ఓ యువతిని పట్టపగలే కిడ్నాప్‌ చేసి 9మంది సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారంటూ రాజంపేటలో నరేశ్‌ అనే యువకుడిని రక్తం వచ్చేలా కొట్టారు.ఇక పోలీసులు ఎలాగూ గస్తీని గాలికొదిలేశారనుకున్నారేమోగానీ.. చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిలిపి ఉంచిన.. రక్షక్‌ వాహనాన్ని ఓ దొంగ దర్జాగా ఎత్తుకెళ్లాడు. కాకినాడ జిల్లా రౌతులపూడిలో గిరిజన ఎంపీపీ రాజ్యలక్ష్మిపై.. ఇంట్లోకి చొరబడి దాడికి యత్నించారు.

ఇక తన చెల్లి జోలికి రావొద్దని హెచ్చరించినందుకు ఏలూరులో.. ఓ ఓక్తి రూ.50 వేలు సుపారీ ఇచ్చి మరీ మహిళపై యాసిడ్‌ దాడి.. చేయించాడు. సీఎం జగన్‌ సొంత నియోజకవర్గంలోని అంకాళమ్మ గూడూరులో కృష్ణయ్య అనే దళితుడ్ని అత్యంత దారుణంగా చంపేశారు. ఏలూరు.. ప్రభుత్వాసుపత్రిలో ఉన్న చంద్రశేఖర్‌ అనే యువకుడిని దుండగులు కొట్టుకుంటూ తీసుకెళ్లారు.

MP Family Kidnap: విశాఖలో ఎంపీ కుటుంబసభ్యుల కిడ్నాప్​.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు

ఇలా చెప్పుకుంటూపోతే.. రౌండ్‌ ది క్లాక్‌ అన్నట్లుగా..రౌండ్‌ ది క్యాలెండర్‌.. నేరాలు పెచ్చరిల్లుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. సీఎం జగన్‌ నోరు విప్పరు. ఎందుకంటే ఆయన ఉంటారేనీ.. అలాంటివి వినరు. అధికార పార్టీ నేతల అనుచరులు.. బరితెగిస్తున్నా ఆయన పిలిచి హెచ్చరించరు. ఇటీవల మంత్రి జోగిరమేశ్‌.. అనుచరులమంటూ కొందరు నడిరోడ్డుపై పర్యాటకుల బస్సు ఆపి దాడికి తెగబడ్డారు.

మా అన్న జోగి రమేష్‌ మీ అంతు చూస్తాం అంటూ హెచ్చరించారని.. బాధితులు బోరుమన్నా పోలీసులు.. ఇంతవరకూ కేసే పెట్టలేదు. ఇక నెల్లూరులో టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డిపై కొంతమంది కర్రలతో.. దాడికి ప్రయత్నించారు. రెక్కీ కూడా చేశారు. కానీ పోలీసులు ఆ కథకు వింత ముగింపు ఇచ్చేశారు. వాళ్లంతా ప్రచారం కోసమే.. ఆనంపై దాడికి పథకం వేశారంటూ కేసు ఫైల్‌ను మడతపెట్టేశారు.

ఇలాంటివన్నీ రాష్ట్రంలో.. పోలీస్‌ వ్యవస్థను అధికార పార్టీ అనుబంధ విభాగంలా మార్చేశారనే స్థాయికి విమర్శలు దారితీస్తున్నాయి. ఎస్పీల నుంచి.. ఎస్సైల వరకు వైసీపీలోని ముఖ్య నేతల కనుసన్నల్లోనే పోస్టింగ్‌లు ఉంటున్నాయి. అందుకే నేతలు చెప్పినట్లే పోలీసుల లాఠీలు పనిచేస్తున్నాయి. కొందరైతే.. అధికార పార్టీ నాయకుల కన్నా ఎక్కువ ఫీలైపోతూ.. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే గొంతు నొక్కుతున్నారు.అసలు పోలీస్‌ వ్యవస్థ రిమోటే.. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉంది.

నెల్లూరులో టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నం

కొన్నిసార్లు దందాలు, దమ్మీలు చేస్తున్నారని తెలిసినా అధికార పార్టీ నాయకుల అండదండలున్నాయని తెలిసి.. మనకెందుకొచ్చిన గొడవలే అని చేతులెత్తేస్తున్నారు. అధికార పార్టీ నేతల అరాచకాలపై చర్యలు తీసుకోకుండా.. ప్రభుత్వం పోలీసుల చేతులు కట్టేస్తోంది. అందుకే.. వివాదస్పద స్థలాల్లోకి రౌడీమూకలు చొరబడి అల్లర్లు సృష్టిస్తుంటే కొట్టుకున్నప్పుడు చూద్దాంలే అంటూ చాలా తేలిగ్గా పోలీసులు సమాధానమిస్తున్నారు.

అసలు రాష్ట్రంలో.. పోలీసు గస్తీ నామమాత్రంగా మారింది. సిబ్బంది కొరత ఎప్పుడూ ఉండేదే. ఉన్న సిబ్బంది కూడా.. వైసీపీ ప్రజాప్రతినిధుల బందోబస్తుకు, ప్రతిపక్షాల అణచివేతకే చాలడంలేదు. సీఎం పర్యటన ఉంటే చాలు వారం ముందు నుంచే హడావుడి.. మొదలుపెట్టేస్తారు. రోడ్ల వెంట బారికేడ్లు, పరదాలు, బారికేడ్లు, ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా సభ ముగిసేవరకూ.. అదే పనిలో ఉంటారు.

ఇక ప్రతిపక్ష పార్టీల నాయకుల పర్యటనలుంటే చాలు.. ఆ జిల్లాతోపాటు పొరుగుజిల్లాల్లోని పోలీస్‌ బాసులు కూడా.. ఎలా నియంత్రించాలనే ధ్యాసలోఉంటారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టకుండా చూసుకోడానికి కొందరు.. పోస్టులు పెట్టినవారిని అరెస్టు చేయడానికి కొందరు ఉంటారు. ఇలా.. రాజకీయ పోలీసింగ్‌ మస్తుగా చేస్తూ.. గస్తీని గాలికొదిలేయడం అరాచకాలకు ఆ అవకాశంగా మారుతోంది.

The female MPP tears : 'ఎమ్మెల్యే నుంచి మాకు ప్రాణహాని..' ఎస్టీ మహిళా ఎంపీపీ కంటతడి

ABOUT THE AUTHOR

...view details