గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఇటీవల చోటు చేసుకున్న వరుస హత్యల ఉదంతాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. వరుస హత్యలు, దాడులతో ప్రజలు ఉలికి పాటుకు గురవుతున్నారు. గడిచిన కొద్దిరోజుల్లో చూసుకుంటే.. తెనాలిలో ఆరుగురిపై హత్యాయత్నాలు జరిగాయి. ఈ ఘటనల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు గాయాలతో బతికి బయటపడ్డారు.
ఈ నెల 14న కొలకలూరులో అన్నను తమ్ముడు దారుణంగా కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణానికి కుటుంబ కలహాలే కారణంగా తేలింది.
మరుసటి రోజు 15వ తేదీన నందివెలుగు జాషువా నగర్లో భార్యపై అనుమానంతో భర్త ఆమెను ఉరివేసి హత్య చేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పోలీసులు పసిగట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
ఈ నెల 20న తెనాలి పట్టణం సుల్తానాబాద్‌లో ఇంట్లో నిద్రిస్తున్న చంద్ర నాయక్‌ను అర్ధరాత్రి విచక్షణా రహితంగా కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు. చంద్రనాయక్ భార్య జ్యోతి అక్క కొడుకు సాయి ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది.
23వ తేదీన మారిస్ పేటలో వియ్యంకుడు, వియ్యంకురాలిపై అల్లుడి తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. పండుగకు కుమార్తె ఇంటికి వచ్చిన వారిపై మామ కత్తితో దాడి చేసి గాయపరిచారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.