ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిశ్రమల తనిఖీకి ప్రత్యేక యంత్రాంగం: సీఎం జగన్ - ఎఫ్‌ఆర్‌బీఎంపై సీఎం జగన్ సమీక్ష

నాలుగు అంశాల్లో సంస్కరణలు చేయాలని కేంద్రం పంపిన మార్గదర్శకాలను పూర్తిగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల్లో కాలుష్యం, భద్రతకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు.

CM JAGAN
CM JAGAN

By

Published : Jul 27, 2020, 10:51 PM IST

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచాలంటూ రాష్ట్రాలు కోరిన దృష్ట్యా దీనికోసం కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సమీక్షించారు. నిర్మాణాత్మక సంస్కరణల్లో భాగంగా, ఒకే దశం- ఒకే రేషన్‌ కార్డు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్వయం సమృద్ధి, విద్యుత్‌రంగం అనే ఈ నాలుగు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెప్పిన సంస్కరణలను అధికారులు సీఎంకు వివరించారు.

⦁ దేశంలో ఎక్కడైనా సరే రేషన్‌ పొందేలా కేంద్రం ఒకే దేశం... ఒకే రేషన్‌ కార్డు విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించిన దృష్ట్యా దీనికి సంబంధించి పూర్తి చేయాల్సిన కార్యక్రమాలను సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎక్కడైనా రేషన్ తీసుకునే సదుపాయం ఉందని అధికారులు సీఎం జగన్​కు వెల్లడించారు. అలాగే రేషన్‌ పంపిణీలో పారదర్శకత కోసం బయోమెట్రిక్‌ విధానాన్ని అనుసరిస్తుండగా.. ఈ విధానంలో ఇప్పటికే రాష్ట్రం ముందు ఉందని అధికారులు వివరించారు.

⦁ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కోసం కేంద్రం చెప్పిన సంస్కరణల విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ముందంజలో ఉందని అధికారులు వివరించారు. సింగిల్‌ విండో విధానాలు అనుసరిస్తూ.. అనుమతుల విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు. పరిశ్రమలు ఎంత ముఖ్యమో... వాటి భద్రత కూడా ముఖ్యమని సీఎం జగన్ చెప్పారు. విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని పరిశ్రమల్లో కాలుష్యం, భద్రత వంటి అంశాలను తనిఖీ చేసేందుకు సరైన యంత్రాంగాన్ని రూపొందించాలని సూచించారు. అలాగే కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

⦁ కార్మిక సంస్కరణలకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సంస్కరణలపైనా సమావేశంలో చర్చ జరిగింది. కొవిడ్ విపత్తు నుంచి తిరిగి పారిశ్రామిక రంగాన్ని పట్టాలపైకి తీసుకొచ్చి వేగంగా నడిపించడానికి ఈ సంస్కరణలు తీసుకురావాలంటూ కేంద్రం చెప్తోందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ ప్రయత్నంలో కార్మికుల ప్రయోజనాలకు భంగం కలగకూడదని సీఎం స్పష్టం చేశారు.

⦁ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్వయం సమృద్ధికోసం సంస్కరణలు తీసుకురావాలంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పిన మీదట సమావేశంలో చర్చ జరిగింది. పట్టణ ప్రాంతాల్లో మెరుగైన సేవలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. పరిశుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాల్లో నాణ్యమైన సేవలు అందాలన్నారు. నాణ్యమైన సేవలు అందించడమన్నది పరిపాలనలో ఒక ప్రమాణంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సేవలు నాణ్యంగా ఉన్నాయా? లేదా? అన్నదాన్ని నిర్ధారించడానికి ఒక యంత్రాంగం ఉండాలన్నారు. ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

⦁ విద్యుత్‌ రంగం సంస్కరణల్లో భాగంగా విద్యుత్‌ సరఫరా, సాంకేతిక నష్టాలను తగ్గించాలన్న కేంద్రం సూచనలపైనా సమావేశంలో చర్చించారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. కరెంటు సరఫరా నష్టాలు రాష్ట్రంలో చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు వివరించారు. అంతేకాక పగటిపూట 9 గంటల కరెంటు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఫీడర్లను అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే దీనికి సంబంధించి 82 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా పూర్తయితే రబీ నుంచి సంపూర్ణంగా రైతులకు నాణ్యమైన విద్యుత్‌ లభిస్తుందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి

తమిళనాడులో పట్టుబడ్డ నగదు కథ ఈడీకీ చేరింది

ABOUT THE AUTHOR

...view details