CRDA layout development : రాజధాని ప్రాంతంలోని ఆర్ 5 జోన్ లో లేఅవుట్ అభివృద్ధి పనులను సీఆర్డీఏ యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఆర్5 జోన్ లో 51,392 మందికి ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. అర్హులకు నెక్కల్లు, నవులూరు, కృష్ణాయపాలెం, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచుకల పాలెం, బోరుపాలెం, అనంతవరం ప్రాంతాల్లో ప్రభుత్వం ఇళ్లపట్టాలు ఇవ్వనుంది. ఈ గ్రామాల్లోని 1402 ఎకరాల్లో 25 లేఅవుట్లను సీఆర్డీఏ యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తోంది. లే అవుట్లలో రహదారులు, లెవలింగ్, గ్రావెలింగ్ పనులు, ప్లాట్లలో హద్దురాళ్లను వేస్తోంది. లే అవుట్ పనుల్ని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పరిశీలించారు.
చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు.. అమరావతిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే వాటిని సమాధులని చంద్రబాబు వ్యాఖ్యానించడం సిగ్గుచేటని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లలపై చంద్రబాబు మాట్లాడిన మాటలు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పేదలను, సామాన్య ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజల కోరికను బట్టి అమరావతిలో ఇళ్ల స్థలాలను కేటాయించినట్లు తెలిపారు. అమరావతిలో పేదలకు ఇస్తున్న నివాస స్థలాలు శాశ్వతమైనవని చెప్పారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని టీడీపీ నేతలు ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. జీవో 1 పై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని స్పష్ట చేశారు.