CPT Test For Groups : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే గ్రూప్ 2, 3 ఉద్యోగాల నియామకానికి ఇక నుంచి కంప్యూటర్ ప్రోఫీషియన్సీ సర్టిఫికెట్ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇక నుంచి ఏపీపీఎస్సీ లేదా ఏపీ సాంకేతిక విద్యా బోర్డు నిర్వహించే సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీసుల్లో నియామకానికి అవకాశం లేదంటూ.. అడహాక్ నిబంధనలు జారీ చేశారు.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా సీపీటీ (కంప్యూటర్ ప్రోఫిషియన్సీ టెస్టు) పాస్ కావాల్సిందేనని స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. వంద మార్కులకు గానూ కంప్యూటర్ ప్రోఫీషియన్సీ టెస్టు నిర్వహించనున్నట్టు సాధారణ పరిపాలనా శాఖ సర్వీసెస్ విభాగం పేర్కొంది.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు కనీసంగా 30 మార్కులు, బీసీలకు 35, ఓసీలకు 40 మార్కులను సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు, వివిధ రకాల ఆపరేటింగ్ సిస్టంలు, విండోస్, ఇంటర్నెట్ తదితర అంశాల్లో పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్ఫష్టం చేస్తూ ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే గ్రూప్ 1 సర్వీసు ఉద్యోగాలకు ఈ తాత్కాలిక నిబంధన వర్తించదని పేర్కొంటూ సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్ కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వులు విడుదల చేశారు.