వ్యవసాయ సాగు చట్టాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం నియమించిన కమిటీ వల్ల ప్రయోజనం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సీపీఐ నిర్వహించిన భోగి మంటల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం రూపొందించిన సాగు చట్టాల ప్రతులు, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్ను ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే...మరోవైపు ప్రజలపై మోయలేని భారాలను మోపుతోందని రామకృష్ణ ఆరోపించారు.
కడపలో..
కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన జీవోలను రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామని కడప జిల్లా సీపీఐ కార్యదర్శి ఈశ్వరయ్య హెచ్చరించారు. ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ కడప నగరపాలక కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. సంబంధిత పత్రాలను భోగి మంటల్లో వేసి దహనం చేస్తూ... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు ఉరితాడుగా మారిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.