Electric Meters for Agricultural motors: రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగింపుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తప్పుబట్టారు. పెద్దిరెడ్డి చెప్పినట్లుగా స్మార్ట్ మీటర్ల కోసం ఖర్చయ్యే 1150 కోట్లు ఎవరి సొమ్మని నిలదీశారు. నిజంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనుకుంటే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఎందుకని ప్రశ్నించారు.
కోట్లాది రూపాయల ప్రజాధనం వృథాగా ఖర్చు చేయాల్సిన అవసరమేముందని రామకృష్ణ మండిపడ్డారు. విద్యుత్ మీటర్లు రైతుల మెడకు ఉరితాళ్లు కానున్నాయన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు బిగించుకుని విద్యుత్తు వాడకం లెక్కించు కోవాలన్నారు. రైతులకు అన్యాయం జరుగుతుందనే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ మీటర్ల ఏర్పాటు వ్యతిరేకించిందన్నారు.