CPI, CPM protested across the state: ఉద్యోగ, ఉపాధ్యాయులపై వైఎస్సార్సీపీ సర్కార్ అవలంబిస్తున్న నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ఊధృతం అయ్యాయి. అనంతపురం గాంధీ విగ్రహం వద్ద వామపక్ష నేతలు నిరసన తెలిపారు. క్లాక్ టవర్ నుంచి గాంధీ విగ్రహం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన వేధింపులను ఆపాలని డిమాండ్ చేస్తూ.. వారికి ఇచ్చిన హామీల నెరవేర్చకుండా వారిపై కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమని సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని కోరారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి నియంత పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని కడప సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర పిలుపునిచ్చారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ కడప ఆర్డీవో కార్యాలయం కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మోసపూరిత హామీలతో ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపిస్తూ.... విజయవాడ ధర్నా చౌక్ వద్ద వామపక్ష నాయకులు ధర్నా చేశారు. ఉద్యోగులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమని గుంటూరు స్థానిక శంకర్ విలాస్ సెంటర్లో సీపీఐ, సీపీఎం నిరసన తెలిపారు. ఉద్యోగులపై ప్రభుత్వ వేధింపులను ఆపాలని డిమాండ్ చేస్తూ విశాఖలో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి.