గుంటూరు జిల్లా నరసరావుపేటలో 200 పడకలతో ఏర్పాటు చేయనున్న కొవిడ్ ఆసుపత్రి ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆగస్టులోనే దీన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పిన పాలకులు, అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఆగస్టు 17న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీరంగనాథరాజు, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడదల రజిని ఆసుపత్రిని అట్టహాసంగా ప్రారంభించారు. 200 పడకల కొవిడ్ ఆసుపత్రిలో వారం రోజుల్లో సేవలు అందేలా చేస్తామని ప్రకటించారు. 90 వెంటిలేటర్లు, 150 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించనున్నామని ఎమ్మెల్యే గోపిరెడ్డి చెప్పారు. ఇప్పటికీ ఆసుపత్రి అందుబాటులోకి రాలేదు. ప్రహరీ నిర్మాణం మాత్రమే జరిగింది. ఆసుపత్రి ఆవరణలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. వైద్యులు, సిబ్బంది నియామక పక్రియ చేపట్టలేదు.
పల్నాడు ప్రాంతంలో కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉండడంతో కొవిడ్ బాధితులు రోజూ వందల్లోనే ఉంటున్నారు. వీరికి సరైన వైద్య సదుపాయాలు అందించడానికి యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. వైరస్ బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా పడకలు లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందాలంటే రోజుకి రూ.30వేల నుంచి 50 వేల వరకు ఫీజు చెల్లించాల్సిన పరిస్థితులున్నాయి.
రెండు జిల్లాల ప్రజలకు ఉపయోగం
నరసరావుపేటలో 200 పడకలతో కొవిడ్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే రెండు జిల్లాల ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది. నరసరావుపేట, వినుకొండ, గురజాల, మాచర్ల చిలకలూరిపేట నియోజకవర్గాలతో పాటు ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు వైద్యం అందించవచ్ఛు పట్టణంలోని ఎన్నెస్పీ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆసుపత్రి భవనం ఏడాదిన్నర క్రితం అందుబాటులోకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో రూ.23 కోట్లతో దీన్ని నిర్మించారు. 300 పడకల ఆసుపత్రి నిర్మాణంలో భాగంగా ఒక బ్లాక్‌ను పూర్తి చేయగా మరో రెండు బ్లాక్‌ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. నిధులు రాకపోవటంతో అదనపు బ్లాకుల నిర్మాణ పనులు చేపట్టలేదు. పూర్తయిన ఒక్క బ్లాక్ కూడా నిరుపయోగంగా ఉంది. ఇందులో 200 పడకలు కల్పించి కొవిడ్ ఆసుపత్రిగా ఉపయోగించుకోవాలని అధికారులు భావించి ఆగస్టులో ప్రారంభోత్సవం చేశారు. అనంతరం వసతుల కల్పనలో జాప్యం జరగడంతో ఇంకా అందుబాటులోకి రాలేదు.