అవినీతి అనేది సీఎం జగన్ డీఎన్‌ఏలోనే ఉందని.... గుడి, గుడిలో లింగాన్ని కూడా మింగే తత్వం ఆయనదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తెలుగుదేశం మహానాడులో జే ట్యాక్స్ వసూళ్ల పేరుతో తీర్మానాన్ని లోకేశ్ ప్రవేశపెట్టగా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి బలపరిచారు. నేతి బీరకాయలో నెయ్యి లేనట్లే జగన్ నీతి వ్యాఖ్యల్లో నిజాయితీ ఉండదని లోకేశ్ దుయ్యబట్టారు. ఒక్క మద్యం ద్వారానే కోట్లాది రూపాయలు జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మండిపడిన లోకేశ్... కరోనా కిట్లు, బ్లీచింగ్ పౌడర్, భూ, విద్యుత్ కొనుగోళ్లు అన్నీ అవినీతిమయమేనని ఆరోపించారు. ఏ2 విశాఖకు మకాం మార్చి విలువైన భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. బిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రాన్ని సోల్డ్ ఏపీగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి ఆస్తులను కూడా అమ్మకానికి పెట్టటంతో జగన్ ధన దాహానికి అడ్డే లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
తెలుగుదేశం అధికారంలో ఉండగా హెచ్‌సీఎల్, కియాతో పాటు ఎన్నో సంస్థలు రావటానికి కృషి చేశామని గుర్తుచేసిన లోకేశ్... జగన్ అధికారంలోకి వచ్చాక కొత్త రకం మద్యం బ్రాండులు తప్ప రాష్ట్రానికి ఏమి వచ్చాయని నిలదీశారు. పెట్టుబడుల వేటలో సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్‌గా అన్నింటా పోటీపడిన రాష్ట్రం కాస్తా సన్‌సెట్ ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ని ఇలానే కొనసాగిస్తే ప్రజలకు విషం లాంటి వైన్ పోస్తారని దుయ్యబట్టారు. ఆడపిల్లలు బయట తిరగలేని పరిస్థితి ఏపీలో రానుందన్న లోకేశ్.... జగన్ అరచాకాలను తరిమికొట్టేందుకు అంతా ఏకం కావాలని కోరారు.