GUNTUR CORPORATOR :గుంటూరు నగరంలో అధికార పార్టీ కార్పొరేటర్ తీరు తీవ్ర చర్చకు దారితీసింది. తోపుడు బండ్ల వ్యాపారుల నుంచి తానే రుసుము వసూలు చేసి కార్పొరేషన్ కు జమ చేస్తానని చెప్పటంతో పాటు వసూళ్లకు వెళ్లిన ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేయటం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై తోపుడు బండ్ల వ్యాపారులు మండిపడుతున్నారు. కోట్ల రూపాయలు జేబులో వేసుకునేందుకే కార్పొరేటర్ ముందుకు వచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వందల మంది చిరు వ్యాపారులు తోపుడు బండ్లపై పండ్లు, పూలు, కూరగాయలు పెట్టుకుని విక్రయిస్తుంటారు. వారి నుంచి రోజువారీ పన్ను వసూలుకు కాంట్రాక్టు ఇస్తుంటారు. మార్చి నెలతో కాంట్రాక్టు ముగియగా... కొత్తగా ఎవరికీ ఇవ్వలేదు. టెండర్లు పిలిచి గుత్తేదారుకు బాధ్యతలు అప్పగించే వరకు ఈ వసూళ్లు రెవెన్యూ విభాగానికి చెందిన ఆర్‌ఐ, బిల్ కలెక్టర్లు చూడాలని కమిషనర్ ఆదేశించారు. దీనికి అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ ఒకరు అడ్డు తగులుతూ ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. వసూళ్లకు వెళ్లవద్దని, తానే వసూలు చేసి జమ చేస్తానని ఉద్యోగులకు హుకుం జారీ చేశారు. కొందరు వసూళ్లకు వెళ్తే.. బెదిరింపులకు దిగారు. కార్పొరేటర్ అనే గౌరవం లేకుండా వెళ్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేయటం నగరపాలక సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
పీవీకే నాయుడు మార్కెట్‌తో పాటు దాని పరిసరాల్లోనే సుమారు 500 మందికి పైగా వ్యాపారులు ఉంటారు. ఇక్కడ కోట్లలో ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో టెండర్లు పిలిచే వరకైనా వసూలు చేసుకుందామనే ఆలోచనలో కార్పొరేటర్ ఉన్నారు. కొందరు వ్యాపారుల నుంచి వసూళ్లు చేశారు. విషయం తెలిసిన వీధివ్యాపారుల సంఘం కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసింది. వీధి వ్యాపారుల ఫిర్యాదుతో ప్రస్తుతం వసూళ్లు ఆపివేయాలని కమిషనర్ అధికారుల్ని ఆదేశించారు. వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కివ్వాలని వ్యాపారులు కోరుతున్నారు.