కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో ఇప్పటి వరకూ 314 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించగా... అందులో 20 పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యాయి. 200 మందికి నెగిటివ్ వచ్చింది. మిగిలిన 94 మంది నివేదికలు రావాల్సి ఉంది. కరోనా రోగ నిర్ధరణ పరీక్షల కోసం గుంటూరులో ఏర్పాటు చేసిన ప్రయోగశాల రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. వైద్యకళాశాల ప్రాంగణంలోని ల్యాబ్‌లోనే ఈ ప్రయోగశాల ఏర్పాటు చేశారు. రోజుకు 60 నమూనాలు పరిక్షించేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.
కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో 17 మంది మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో, ఇద్దరు విజయవాడ కొవిడ్-19 ప్రత్యేక వార్డులో, మరొకరు గుంటూరు ఐడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనుమానితులతో పాటు పాజిటివ్ వచ్చిన వారి కుటుంబసభ్యులను కాటూరి ఆసుపత్రి క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. మరికొందరు ఐడీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఆసుపత్రిలో 10 పడకలు పాజిటివ్ కేసుల కోసం కేటాయించారు. ఎవరికైనా పాజిటివ్ ఉన్నట్లు తేలితే వెంటనే వారిని సంబంధిత వార్డులోకి మారుస్తున్నారు.