కంటికి కనపడని కరోనా వైరస్ గుంటూరు జిల్లాను పట్టి పీడిస్తోంది. జిల్లాలో ఇప్పటికే కేసుల సంఖ్య 529కి చేరింది. ఇందులో గుంటూరు నగరంలోనే 209 కేసులు నమోదయ్యాయి. కేసుల వ్యాప్తికి మొదట్లో మర్కజ్ లింకులు కారణమయ్యాయి. అయితే ఇటీవలి కాలంలో వస్తున్న కేసులు కోయంబేడు మార్కెట్ లింకులున్నట్లు అధికారులు గుర్తించారు. రెండు, మూడు రోజులుగా గుంటూరులో వెలుగు చూస్తున్న కరోనా కేసుల్లో ఎక్కువగా హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ వ్యాపారులు, అక్కడ పనిచేసేవారు, వారి కుటుంబసభ్యులే ఉన్నారు.
హోల్‌సేల్ వ్యాపారి ద్వారా
మొదట్లో ఓ టమాటా హోల్‌సేల్ వ్యాపారికి కరోనా సోకింది. అతను మార్కెట్ వ్యాపారుల సంఘంలో కీలకమైన వ్యక్తి కావటంతో అందరినీ కలుస్తూ ఉండేవారు. ఈ క్రమంలో అతని నుంచి ఇతర వ్యాపారులు, కూలీలకు కరోనా వచ్చింది. అలాగే సదరు వ్యాపారి కుటుంబ సభ్యుల్లో 5 మందికి వైరస్ సోకింది. ఇలా మొత్తం 25 మంది కరోనా బారిన పడ్డారు. మొదటగా కరోనా వచ్చిన వ్యక్తికి ఎలా వచ్చిందని అధికారులు ఆరా తీశారు. కరోనా లాక్డౌన్ నుంచి హోల్‌సేల్ మార్కెట్ గుంటూరు శివార్లలో నిర్వహిస్తున్నారు. అక్కడకు ఇతర రాష్ట్రాల నుంచి సరకు వస్తుంటుంది.
కోయంబేడు నుంచి వచ్చిన వారి వల్ల
కోయంబేడు మార్కెట్ వెళ్లి వచ్చిన వారిలో చాలామందికి కరోనా సోకింది. ఈ క్రమంలో అక్కడి నుంచి వచ్చిన లారీ డ్రైవర్ల ద్వారా ఈ వ్యాపారికి కూడా సోకి ఉంటుందనే అంచనాకు వచ్చారు. వందలాది మంది వ్యాపారులు, వెయ్యి మంది వరకూ కూలీలు ఉండే మార్కెట్లో కరోనా రావటంతో అధికారులు ఉలిక్కి పడ్డారు. మార్కెట్లో ఉండే వారందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు చేయిస్తున్నారు. ఇప్పటికే 450 మందికి పరీక్షలు నిర్వహించారు. మిగతా వారికి వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేయించాలని భావిస్తున్నారు.
మార్కెట్ మూసివేత
అలాగే పరిస్థితి చక్కబడే వరకూ మార్కెట్‌ను మూసివేయాలని నిర్ణయించారు. మార్కెట్ మూతపడ్డ కారణంగా జిల్లాలో కూరగాయల సరఫరాకు ఆటంకం ఏర్పడనుంది. ప్రజలకు కూరగాయల కొరత రాకుండా... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వ్యాపారులు కోరుతున్నారు.
సడలింపుపై పునరాలోచన
హోల్‌సేల్ మార్కెట్లో వ్యాపారులకు కరోనా సోకటంతో లాక్డౌన్ ఆంక్షల సడలింపుపై అధికారులు పునరాలోచనలో పడ్డారు. ఎక్కువ మంది తిరిగే మార్కెట్లలో ఎవరికి వైరస్ సోకినా... వేగంగా వ్యాపిస్తుందని ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇతర మార్కెట్లలో పకడ్బందీ జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు... ఆంక్షలు కఠినతరం చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు.