రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. లాక్డౌన్ సడలింపుల తర్వాత వైరస్ ఉద్ధృతి తీవ్రమైంది. సడలింపులతో తిరిగి సేవలు ప్రారంభించిన ఆర్టీసీపైనా కరోనా ప్రభావం పడింది. ప్రయాణికులు లేక నష్టాలు ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే...ఆర్టీసీ ఉద్యోగులు సైతం వైరస్ బారిన పడుతున్నారు. లాక్డౌన్ సమయంలోనూ ఆర్టీసీ ఉద్యోగులు పోలీసులకు సహాయంగా కరోనా విధులు నిర్వహించారు.
పిడుగురాళ్ల డిపోలో కరోనా కలకలం
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల డిపో గ్యారేజిలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా సోకింది. దీంతో ఇతర ఉద్యోగులలో ఆందోళన నెలకొంది. అధికారులు కనీస పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించకుండా పని చేయిస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. మరికొందరిలోనూ కరోనా అనుమానిత లక్షణాలు కనిపించాయంటున్నారు. గ్యారేజిలో మెకానికల్ ఫోర్‌మెన్‌గా పని చేస్తున్న ఓ ఉద్యోగి డిపో మేనేజర్‌పై ఆగ్రహం వెలిబుచ్చారు. తనను ఇంట్లోకి రానీయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్యారేజిలో కనీసం శానిటైజర్లు, మాస్కులు కూడా అందుబాటులో లేవని... ఈ పరిస్థితుల్లో ఎలా పని చేయాలని నిలదీశారు. ఈ పరిణామాలపై ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరికి పాజిటివ్‌గా తేలిందని... తమకు కరోనా పరీక్షలు చేయించాలని కోరుతున్నారు.