తమలపాకు రైతుకు కరోనా దెబ్బ గుంటూరు జిల్లా కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని వందల ఎకరాల్లో తమలపాకు సాగుచేస్తారు. జిల్లా కేంద్రం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలకు తమలపాకు ఎగుమతి అవుతుంది. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు ఇక్కడ నుంచే తమలపాకు రవాణా చేస్తారు. వైరస్ ప్రభావం వల్ల దేవాలయాలు మూతపడటం, రవాణా నిలిచిపోవటం వల్ల తీవ్రనష్టం వచ్చిందని తమలపాకు రైతులు ఆవేదన చెందుతున్నారు. 40 రోజుల్లో కోతకొచ్చే ఆకులను కొనేవారు లేరని, కోసినా ఆకులకు రవాణా సౌకర్యం లేదని వాపోతున్నారు.
అందని వరదసాయం
గత వర్షాకాలంలో కృష్ణా నది వరదల వల్ల రెండు సార్లు పంట నష్టపోయామని రైతులు తెలిపారు. మరోసారి అప్పులు తెచ్చి పంటసాగు చేస్తే కరోనా వల్ల అమ్ముకోడానికి వీలు లేకపోయిందని ఆవేదన చెందారు. ఆకులు కోతకొచ్చినా.. కోస్తే కొనేవాళ్లు లేక చెట్టునే వదిలేస్తున్నామంటున్నారు. ఎకరాకు రెండున్నర లక్షలు పెట్టుబడి పెట్టి సాగుచేశామని చెప్పారు. తమలపాకు ఎవరూ కొనక తమకు పనులు ఉండటంలేదని కూలీలు చెబుతున్నారు. గత వరదసాయం ఇంకా అందలేదంటున్న రైతులు... ఈసారైనా ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి:
అమ్మ ప్రేమ ఒక వైపు... కరోనా కట్టడి బాధ్యత మరోవైపు!