గుంటూరు మిర్చి యార్డుని కోవిడ్ వీడటం లేదు. లాక్డౌన్ కారణంగా మిర్చియార్డును రెండు నెలల పాటు మూసివేసి, మే 23న తెరిచారు. ఒక హమాలీకి కరోనా పాజిటివ్ రావటంతో మళ్లీ వారం రోజుల పాటు నిలిపివేయగా... ఆ తర్వాత జాగ్రత్తలు తీసుకుని యార్డులో కార్యకలాపాలు మొదలుపెట్టారు. రైతులు తమ పంటను అమ్ముకునేందుకు వస్తున్న సమయంలో మళ్లీ ఇద్దరు కమిషన్ ఏజెంట్లు కరోనా బారిన పడటం కలకలం రేపింది. వెంటనే మిర్చియార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.
రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, గుమస్తాలు, హమాలీలు భయంతో మిర్చి యార్డుకు వస్తున్నారు. కరోనా వచ్చినవారు యార్డులో తిరగటంతో అందరిలో ఆందోళన మొదలైంది. కొద్దిరోజులు యార్డు మూసివేస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యార్డులో గతంలో మాదిరిగా కార్యకలాపాలు లేకపోయినప్పటికీ కనీసం వెయ్యి నుంచి రెండు వేల మంది తప్పనిసరిగా ఉంటారు. ఈ తరుణంలో వైరస్ విజృంభిస్తే ప్రమాదకరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.