సాధారణ రోజుల్లోనే ఒక్క రోజు బంద్కు పార్టీలు ప్రజా సంఘాలు పిలుపు ఇస్తేనే ప్రజలు అనేక ఇబ్బందులు పడతారు. అలాంటిది గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా నలభై ఐదు రోజులుపాటు సకలం బంద్ అయ్యి జనం ఇళ్లకే పరిమితమై పోయారు. కరోనా మహమ్మారి సంక్రమించకుండా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలైంది. రద్దీ రహదారులు, వాణజ్య కూడళ్లు, సముదాయాలు నిర్మాణుష్యంగా మారిపోయాయి. నిత్యావసరాలు, కూరగాయలు వంటి అత్యవసర దుకాణాలు తప్ప మిగతావి ఒక్కటి కూడా తెరుచుకో లేదు. మరి ఇలాంటి కష్ట కాలంలో బతకడానికి ఎన్ని పాట్లు పడాలో అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు సాధారణ జనం.
వీరిలో బైక్, స్కూటర్, సైకిల్ మెకానిక్లు, ఎలక్ట్రీషియన్లు, టైలర్లు, ఏసీ, ఫ్రిజ్, టీవీ మెకానిక్ లు పూర్తిగా ఇళ్లకే పరిమితమైపోయారు. ఆదాయాలు హరించుకుపోయి. పనులకు బయటకు వెళ్లే మార్గం, కుటుంబ పోషణకు సతమతమై పోయారు. వేసవి అంటేనే ఎన్నో రంగాల వారికి ఆదాయం సమకూరే సమయం. అత్యధిక స్థాయిలో జరిగే పెళ్లిళ్లు, శుభ కార్యాలు ఎంతో మందికి ఉపాధితోపాటు మంచి ఆదాయం తెచ్చి పెట్టేవి.
ఈ ఏడాది ముహూర్తాలు కూడా అధికంగా ఉన్న కారణంగా అందరూ సంతోష పడ్డారు. పెళ్లిళ్ల సమయంలో ఫొటో, వీడియో గ్రాఫర్లు ఖాళీ లేకుండా గడిపేవారు. మంచి మంచి ఆర్డర్లు తెచ్చుకొని అధిక ఆదాయం పొందేవారు. అలాగే వంట మేస్త్రీలు, క్యాటరింగ్ సిబ్బంది, ఈవెంట్ నిర్వాహకులు, పూలు, స్టేజి డెకరేషన్ ఇలా పెళ్లిళ్లపై ఆధారపడి జీవించే వారందరి పైనా కరోనా రూపంలో కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన ఉపద్రవం అందరిపైనా విరుచుకు పడింది. పొట్ట గడిచే మార్గం లేక ఇళ్లలోనే ఉండి భవిష్యత్ పై బంగతో బతుకీడ్చారు. ప్రభుత్వం ఇచ్చిన రేషన్, నగదు సాయం ఏ మూలకు సరి పోలేదు. ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో వీరంతా ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు.