కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధాశ్రమాల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. వాటిలో చాలా ఆశ్రమాలు దాతలు ఇచ్చే విరాళాలతో నడుస్తున్నవే. లాక్ డౌన్ కారణంగా నిధులు రాక ఆశ్రమాల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు మాస్కులు, శానిటైజర్ల రూపంలో ఖర్చు ఎక్కువైంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు, దాతలు స్పందించి వృద్ధాశ్రమలను ఆదుకోవాలని కోరుతున్నారు.
పాత గుంటూరులోని ఓ వృద్ధాశ్రమంలో దాదాపు 100 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారు. వారిలో ఎక్కువమంది ఎవరూలేని అభాగ్యులు, నిరాశ్రయులే. 14 ఏళ్లుగా ఈ ఆశ్రమం దాతల సహకారంతోనే నడుస్తోంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఆశ్రమానికి వచ్చే నిధులు ఆగిపోయాయి. ఆంక్షలు సడలించినప్పటికీ దాతలు రావడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధాశ్రమాల నిర్వహణ భారంగా మారిందని నిర్వాహకులు చెప్తున్నారు. దీనికి తోడు కరోనా కారణంగా నిర్వహణ వ్యయం ఎక్కువైంది. వృద్ధులకు మాస్కులు, శానిటైజర్లు, యూరిన్ బ్యాగులు ఇవ్వడం తప్పనిసరైంది. దీంతో ఖర్చు పెరుగుతోందని అంటున్నారు నిర్వాహకులు.