లాక్ డౌన్ కారణంగా దాదాపు 80 రోజులుగా హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకోలేదు. ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ హోటళ్లకు ఆశించిన రీతిలో స్పందన కనిపించడంలేదు. కరోనా భయంతో వినియోగదారులు.. నిర్వహణ, నష్ట భయంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు. రుచికరమైన, వైవిధ్యమైన వంటలకు పేరుగాంచిన గుంటూరులోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదు.
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్‌తో అన్ని రంగాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయి. ఈ ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లపై కాస్త అధికంగానే పడింది. దాదాపు 80 రోజులుగా అవి మూతపడ్డాయి. ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులతో అక్కడక్కడా హోటళ్లు తెరుచుకున్నప్పటికీ వ్యాపారం మాత్రం సజావుగా సాగడంలేదు.
నిర్వహణ, నష్టాల భయంతో గుంటూరులో సగం హోటళ్లు ఇప్పటికీ మూసే ఉన్నాయి. కొన్ని మాత్రమే తెరుచుకున్నాయి. వాటిల్లోనూ వ్యాపారం ఆశాజనకంగా లేదు. కరోనా భయంతో వినియోగదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరికొన్నాళ్లు ఇంటి వంటే మంచిదనే భావంతో రెస్టారెంట్లకు దూరంగా ఉంటున్నారు. హోటళ్ల యజమానులకు నిబంధనలు మరింత భారంగా మారాయి. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేయడం, శానిటైజర్లు ఉపయోగించడం వంటివి చేస్తున్నారు. వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క నిపుణులైన వంటవారి కొరత వేధిస్తోంది. గ్రామాల నుంచి వచ్చిన కూలీలు, వంటవారు స్వస్థలాలకు వెళ్లిపోయారు.