కొవిడ్ దెబ్బకు సామాన్యుల జీవితాలు తలకిందులయ్యాయి. కరోనా రక్కసితో అన్ని రంగాలూ కుదేలవగా.. అసంఘటిత కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గుంటూరులో వేలమంది నిరుపేద కూలీలు ఉపాధి లేక, ఇల్లు గడవక తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. గతేడాది లాక్‌డౌన్ సమయంలో చేసిన అప్పుల నుంచి ఇంకా తేరుకోకముందే.. కరోనా సెకండ్ వేవ్ వారి పాలిట శరాఘాతమైంది. కొవిడ్ భయంతో అంతంతమాత్రంగా ఉన్న ఉపాధి పనులు.. కర్ఫ్యూ కారణంగా పూర్తిగా కనుమరుగయ్యాయి.
గుంటూరులోని లాడ్జ్ సెంటర్, గాంధీపార్కు, చుట్టుగుంట ప్రాంతాల్లో పనుల కోసం కూలీలకు రోడ్డుపై ఎదురుచూపులు తప్పడం లేదు. భవన నిర్మాణ పనులు, ముఠా పనులు, మట్టి పనులు, వ్యవసాయ పనులు.. ఏ పని అప్పగించినా చేసేందుకు వీరంతా సిద్ధంగా ఉంటారు. కర్ఫ్యూ నిబంధనలకు తోడు ఇసుక పూర్తి స్థాయిలో లభ్యం కాక పనులు జోరందుకోవడం లేదు. ఓవైపు కరోనా భయం.. మరోవైపు ఆకలి యాతనతో వారు అగచాట్లు పడుతున్నారు.