గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నెల 23 వరకు ఒక్క కేసు నమోదు కాగా.. వారం రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య 12కు చేరింది. గత నెలలో నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలికి కరోనా రావటంతో ఆమెను ఐసోలేషన్కి తరలించారు.
ఈనెల 23న నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడికి మరణానంతరం పరీక్షల్లో కరోనా ఉన్నట్లు తేలింది. అతని అంత్యక్రియల్లో పాల్గొన్న కుటుంబ సభ్యులు, బంధువులను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. చిలకలూరిపేట చిన్న పీర్ సాహెబ్ వీధిలో ఉన్న ఒక మహిళకు 25వ తేదీన పాజిటివ్ నిర్ధరణ అయింది.
ఈ కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు కరోనా పరీక్షలు చేయగా... చిలకలూరిపేటలో ముగ్గురు, యడ్లపాడు మండలంలో నలుగురు, నాదెండ్ల మండలంలో ఇద్దరికి కరోనా సోకినట్లు ఫలితాల్లో తేలింది. బుధవారం ఒక్కరోజులోనే నియోజకవర్గంలో తొమ్మిది పాజిటివ్ కేసులు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గుంటూరులో..
గుంటూరు శ్రీనివాసరావుతోటలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. తాజాగా నమోదైన కేసుతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 448కి పెరిగింది. గుంటూరులో ఇప్పటివరకు 183 కేసులు రాగా, హాట్ స్పాట్ నరసరావుపేటలో 190 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య పెరుగుతుంది.