గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేసులు 100 దాటాయి. ఇప్పటి వరకు గుంటూరు, పల్నాడు ప్రాంతానికి పరిమితమైన కేసులు తీర ప్రాంతంలోనూ వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ కేసులు వెలుగుచూడగానే సంబంధిత వ్యక్తుల ప్రైమరీ కాంటాక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి క్వారంటైన్‌కు తరలించి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపుతున్నారు.
ఇప్పటి వరకు 2200 మంది నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపగా 1800 మంది ఫలితాలు వచ్చాయి. ఒక్క గుంటూరు నగరంలోనే 85 కేసులు రాగా గ్రామీణ ప్రాంతాలు మంగళగిరి, అచ్చంపేట, క్రోసూరు, దాచేపల్లి, నరసరావుపేట, మేడికొండూరు, చేబ్రోలు, కర్లపాలెం మండలాల పరిధిలో 29 కేసులు వెలుగుచూశాయి. జిల్లాలో అనుమానిత లక్షణాలు కలిగిన వారందరినీ గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తీసుకొచ్చామని, వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపుతున్నామని అధికారులు వెల్లడించారు.
4 ప్రాంతాల్లో ట్రూనాట్ పరికరాలతో పరీక్షలు:
జిల్లాలో వ్యాధి నిర్ధరణ పరీక్షల్లో నెలకొన్న జాప్యాన్ని నివారించడానికి కొత్తగా ట్రూనాట్ పరికరాలతో అనుమానితుల నుంచి వారికున్న వ్యాధిని నిర్ధరించే విధానానికి శ్రీకారం చుట్టామని జిల్లా పాలనాధికారి శామ్యూల్ ఆనంద్‌కుమార్ వెల్లడించారు. '‘గుంటూరు, తెనాలి, నరసరావుపేట, మాచర్ల కేంద్రాలుగా ఈ పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాకు 18 పరికరాలు కేటాయించారు.
ఒక్కో యంత్రంపై నిత్యం 200 మందికి పరీక్షలు చేయొచ్చు. రోజుకు 18 పరికరాలపై 3600 మందికి పరీక్షల నిర్వహణకు వీలవుతుంది. ఈ పరికరాలపై కేవలం ప్రిజంప్టివ్ పాజిటివ్ (అనుమానితుడుగా గుర్తిస్తుంది) అని మాత్రమే తెలుస్తుంది. ఈ నమూనాలను తిరిగి వైరాలజీ ప్రయోగశాలకు పంపాకే వ్యాధి నిర్ధరిస్తామని' కలెక్టర్’ చెప్పారు. జీఎంసీ ప్రయోగ కేంద్రంలో నిత్యం 200 పరీక్షలు జరుగుతున్నాయన్నారు. రాపిడ్ టెస్ట్ పరికరాలు ఇంకా రాలేదని, అవి రాగానే వాటితో పరీక్షలు వేగవంతం చేస్తామని వెల్లడించారు.
కరోనా వ్యాప్తిపై ఆరా
గుంటూరులో కంటెయిన్‌మెంట్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లోనే ఇంకా కరోనా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. నగరంలో మాత్రం పాజిటివ్ కేసులు ప్రతి రోజూ బయటపడడంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అసలు గుంటూరులో ఏం జరుగుతోంది? వ్యాధి వ్యాప్తి నివారణ చర్యలు ఎలా ఉన్నాయి? పెద్ద సంఖ్యలో కేసులు బయటపడడానికి కారణాలపై ఆరా తీస్తోంది. నివారణ చర్యలు చేపట్టాలని కంటెయిన్‌మెంట్ జోన్ల ప్రత్యేకాధికారి, కమాండ్ కంట్రోల్ రూం రాష్ట్ర ప్రత్యేకాధికారి, పరిశ్రమలశాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం నిన్న గుంటూరుకు పంపింది.
ఇప్పటికే జిల్లాకు పంపిన మరో సీనియర్ ఐఏఎస్ అధికారి రాజశేఖర్, జిల్లా పాలనాధికారి శామ్యూల్ ఆనంద్‌కుమార్, అదనపు డీజీ ఉజాలా త్రిపాఠి, గుంటూరు రేంజ్ ఐజీ జె.ప్రభాకరరావు, గుంటూరు అర్బన్ ఎస్పీ, డీఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ, నగర కమిషనర్ సీహెచ్ అనూరాధలతో కలిసి ఆనందపేట, కుమ్మరిబజార్ కంటెయిన్‌మెంట్ జోన్లతో పాటు నగరంలోని పలు క్వారంటైన్ కేంద్రాలను పరిశీలించారు. ఆనందపేట, కుమ్మరిబజార్, మంగళదాస్‌నగర్, శ్రీనివాసరావుపేట, సంగడిగుంట, కొరిటిపాడు ప్రాంతాల్లో కంటెయిన్‌మెంట్ జోన్లు ఉన్నాయి.
ఈ ప్రాంతాల్లో ప్రజలు నిత్యావసరాలు, కూరగాయలు, పాలు ఇతరత్రా సరకుల కోసం బయటకు రాకుండా ఉండడానికి.. అనుమానిత లక్షణాలు కలిగిన వారు ఉంటే వారి వివరాలను యంత్రాంగం దృష్టికి తీసుకురావడానికి ప్రతి జోన్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో మున్సిపల్, వైద్య, ఆరోగ్యం, రెవెన్యూ, పౌర సరఫరాలు, పోలీసు అధికారులతో పాటు సచివాలయ యంత్రాంగాన్ని మోహరింపజేసి అక్కడి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. కీలకమైన కమాండ్ కంట్రోల్ రూమ్‌లలో ఆఫీసర్ క్యాడర్ స్థాయిలో బాధ్యతలు అప్పగించి వ్యాధి వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.