ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సడలింపులతో అలజడి.. విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి - corona cases in guntur

గుంటూరు జిల్లాను కరోనా వైరస్ కుదిపేస్తోంది. అన్​లాక్ తర్వాత కేసుల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. గుంటూరులో నగరంలో వైరస్ ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. నర్సరావుపేటలో, తాడేపల్లి, మంగళగిరి, తెనాలి పట్టణాల్లో సైతం కేసులు పెరుగుతుండటం అటు ప్రజలతో పాటు ఇటు అధికారుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. కేసుల నమోదుని బట్టి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు వైరస్ వ్యాపించినట్లు తెలుస్తోంది.

corona cases in guntur
గుంటూరులో కరోనా కేసులు

By

Published : Jun 26, 2020, 10:36 PM IST

Updated : Jun 26, 2020, 11:31 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు వెయ్యి దాటిన జిల్లాల్లో గుంటూరు ఒకటి. జిల్లాలో మొదటి నుంచీ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. మొదట్లో దిల్లీ మూలాలు, ఆ తర్వాత స్థానికంగా వైరస్ వ్యాప్తి, ఇటీవల కోయంబేడు లింకులు, ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి ద్వారా కరోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం జిల్లాలో కొత్తగా 82 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,193కు చేరింది. కొత్తగా వచ్చిన కేసుల్లో గుంటూరు నగరంలోనే 41 ఉన్నాయి. ఆ తర్వాత తాడేపల్లి 10, తెనాలి 3, మాచర్ల 4, మంగళగిరి 3, నర్సరావుపేట, దుండిపాలెం, ఉండవల్లి, క్రోసూరు, పిడుగురాళ్ల 2 చొప్పున నమోదయ్యాయి. కొలకలూరు, పమిడిపాడు, మందపాడు, పొన్నెకళ్లు, ఖాజాలో 1 కేసు చొప్పున వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కరోనా కారణంగా శుక్రవారం ఒకరు మరణించటంతో జిల్లాలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 600 మంది ఇళ్లకు వెళ్లారు. గుంటూరు జీజీహెచ్​లో ముగ్గురు వైద్యులకు పాజిటివ్​గా తేలింది.

అగ్రస్థానంలో

కేసుల సంఖ్య పరంగా చూస్తే గుంటూరు నగరం అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకూ నగరపాలక సంస్థ పరిధిలోనే 445 కేసులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక జిల్లాలోని మిగతా ప్రాంతాలను చూస్తే నర్సరావుపేటలో 227 కేసులున్నాయి. అయితే గత 20 రోజుల నుంచి ఇక్కడ కేసుల తీవ్రత తగ్గటం సానుకూల అంశంగా అధికారులు చెబుతున్నారు. ఇక ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లి ప్రాంతంలో 150 కేసులు నమోదయ్యాయి. గత 20 రోజుల నుంచి ఇక్కడ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే మంగళగిరిలో 50, తెనాలి పట్టణంలో 37, తెనాలి మండలం 20, దుగ్గిరాల 21, దాచేపల్లి20, పిడుగురాళ్ల 4, మాచర్ల 22, చిలకలూరిపేట 11, పెదకాకాని 11, సత్తెనపల్లి 10 కేసులు నమోదయ్యాయి.

లాక్​డౌన్ సమయంలో కేసులు ఒకింత నియంత్రణలోనే ఉండేవి. కానీ అన్​లాక్ తర్వాత రోజూ 40 నుంచి 70 కేసులు వస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత 26 రోజుల్లో 700కు పైగా కేసులు వచ్చాయి. అందులోనూ గత వారం రోజుల్లో 400 మంది పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. వైరస్ కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు తీవ్రం చేశారు. 60ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ పరీక్షలు చేస్తామని జిల్లా అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

'రైతులు కట్టాల్సిన బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది'

Last Updated : Jun 26, 2020, 11:31 PM IST

ABOUT THE AUTHOR

...view details