కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిశితంగా పరీక్షలు చేస్తున్నారు. శరీర భాగాలు దెబ్బతినకుండా వైద్యం అందిస్తున్నారు. కరోనా చికిత్సలో ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది శ్రమిస్తున్నారు. వైరస్ అనుమానిత లక్షణాలతో వచ్చినవారిని ప్రత్యేక వార్డులో ఉంచి, ఇతరులకు వ్యాప్తి చెందకుండా చూస్తున్నారు. తర్వాత రోగి పరిస్థితిని అంచనా వేస్తారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం ఎలా ఉన్నాయో ఎక్స్‌రే, స్కానింగ్ ద్వారా తెలుసుకుంటారు. లక్షణాలను బట్టి వారిని ఓపీ, నాన్ ఐసీయూ, ఐసీయూ కేటగిరీలుగా విభజిస్తారు. అనుమానిత లక్షణాలున్నవారి నుంచి వైద్యులు గొంతు లేదా ముక్కులో దూదిపుల్లతో స్రావాలను (స్వాబ్) సేకరించి, పరీక్షలకు పంపిస్తారు. రోగికి వైరస్‌తో పాటు ఇతర వ్యాధులు ఉండి, పరిస్థితి విషమంగా ఉంటే పెద్దాసుపత్రులకు తరలిస్తున్నారు.
- ఐసీఎంఆర్ మార్గదర్శకాలను అనుసరించి వైద్యులకు రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇచ్చారు.
- నమూనాలు పరీక్షకు పంపిన తర్వాత 24-48 గంటల్లో ఫలితాలు వస్తున్నాయి. అప్పటివరకు అనుమానిత లక్షణాలున్నవారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచుతున్నారు.
కేటగిరీ1
కొవిడ్-19 పాజిటివ్ వచ్చినా లక్షణాలు బయటపడని రకం వీళ్లు. వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. ఇలాంటివారికి బి కాంప్లెక్స్, సి విటమిన్లు ఇస్తున్నారు. వీరిని ఐసొలేషన్ వార్డులో ఉంచి 14 రోజుల పాటు చికిత్స అందిస్తారు.
కేటగిరీ2
వీరికి కొవిడ్ వ్యాధి లక్షణాలు కొద్దిగా కనిపిస్తాయి. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి బయటపడతాయి. ఈ రోగులను గతంలో వేరే వ్యాధులు లేనివారు, ఉన్నవారుగా విభజిస్తున్నారు. వ్యాధులేమీ లేనివారికి విటమిన్ బి, సిలతో పాటు పారాసిటమాల్ ఇస్తున్నారు.దగ్గు, జలుబుకు చికిత్స చేస్తున్నారు. గతంలో వ్యాధులుంటే పై చికిత్సలతో పాటు హైడ్రాక్సీక్లోరోక్విన్, ఫ్లూ మందులు ఇస్తున్నారు. క్యాన్సర్, గుండెజబ్బులు ఉంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కేటగిరీ3
కొవిడ్-19 లక్షణాలు మధ్యస్థం నుంచి తీవ్రంగా ఉండేవారిని ఈ కేటగిరీలోకి తెచ్చారు. వేరే వ్యాధులు ఉన్నా, లేకపోయినా హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇస్తూనే.. శరీర భాగాలు దెబ్బతినకుండా చికిత్స కొనసాగిస్తారు. కేటగిరి-2 కన్నా వీరిపై వైద్యులు ఎక్కువ దృష్టికేంద్రీకరిస్తారు. ఆరోగ్య పరిస్థితిని ఏరోజుకారోజు అంచనా వేస్తూ అవసరమైతే ఐసీయూకు తరలిస్తారు.