పలు జిల్లాల్లో అధికారులు కరోనా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అత్యవసరమైతేనే బయటికి రావాలన్నారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కృష్ణా జిల్లాలో..
ఆసియాలోనే అతిపెద్ద మామిడి మార్కెట్లో ఒకటైన విజయవాడ నున్న మాంగో మార్కెట్లో దుకాణదారులకు, కూలీలకు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీ డ్రైవర్లకు కొవిడ్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గుంటూరు జిల్లాలో..
కరోనా కేసులు పెరుగుతున్నందున బాధితులకు ప్రాథమిక చికిత్స అందించేందుకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముస్తఫా పలు భవనాలను పరిశీలించారు. హోం క్వారంటైన్లో ఉండేందుకు సదుపాయాలు లేని వారి కోసం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
చిలకలూరిపేటలో కరోనా మహమ్మారిపై ప్రజలలో అవగాహన కల్పిస్తూ తహసీల్దార్ సుజాత ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా వాడాలని సుజాత కోరారు. బుధవారం నుంచి అన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో కేవలం పార్శిల్స్‌కు మాత్రమే అనుమతినిచ్చారు. రేపల్లెలో నేటి నుంచి అత్యవసర దుకాణాలు మినహా అన్ని రకాల దుకాణాలను మధ్యాహ్నం 2 గంటలకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని.. మే 2వ తేదీ వరకు నియంత్రణ చర్యలు పటిష్ఠంగా అమలు చేయనున్నట్లు ఎమ్మార్వో విజయ శ్రీ తెలిపారు.