వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విభాగాలతో పాటు, వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. సకాలానికే అందించాలని సీఎం స్పష్టం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు.
వివిధ ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు, వారి జీతాలు, స్థితిగతులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పని చేస్తున్న సుమారు 54 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం చేసింది సున్నా అని సమావేశంలో పలువురు ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు మినిమం టైం స్కేల్‌పై హడావిడిగా జీవో జారీ చేసిందని.. అయినా అమలు చేసే బాధ్యతను ఈ ప్రభుత్వమే తీసుకుందన్నారు. 2019 జులై నుంచి మినిమం టైం స్కేల్ అమలు చేస్తున్నట్లు తెలిపారు.