Contract Employees Regulation in AP: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగుతోంది. 2014 జూన్ 2వ తేదీ నాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను మాత్రమే క్రమబద్దీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించటంపై మిగిలిన ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రస్తుతం పరిమితంగా మాత్రమే ప్రయోజనం దక్కే అవకాశం ఉంది. మరోవైపు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తర్వాత దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది.
వివరాల సేకరణకు ప్రభుత్వం ప్రయత్నాలు:కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించే అంశంపై మంత్రుల కమిటీలో నిర్ణయం తీసుకున్నప్పటికీ దాని అమలు విషయంలో ఇంకా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 2014 జూన్ 2వ తేదీ నాటికి 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని పరిగణనలోకి తీసుకుంటామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. అయితే నిర్దేశిత తేదీ నాటికి ఎంతమంది సర్వీసు పూర్తి చేసుకున్నారన్న వివరాలు ప్రభుత్వం వద్ద లేకపోవటంతో వాటిని సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
వివిధ శాఖల్లో 2014 జూన్ 2వ తేదీ నాటికంటే ముందు నుంచి పని చేస్తున్న ఉద్యోగులు ఎంతమంది అనే అంశంపై వివరాలు సేకరిస్తున్నారు. ఉద్యోగ సంఘాల అంచనాల ప్రకారం నిర్దేశిత తేదీ కంటే ముందు కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న వారి సంఖ్య దాదాపు 7 వేల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఎక్కువగా వైద్యారోగ్యశాఖ, విద్యాశాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్టు వెల్లడవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం 10 వేల మంది వరకు కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకొస్తోంది.
ఆ తేదీపై భిన్నాభిప్రాయాలు: 2014 జూన్ రెండో తేదీని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మంది వరకు కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం 2014 జూన్ 2వ తేదీ కంటే ముందు ఐదేళ్ల సర్వీసు ఉండాలని షరతు విధించటంతో కేవలం 7 వేల మందికి మాత్రమే ప్రయోజనం కలుగుతుందన్న అభిప్రాయం సైతం వ్యక్తం అవుతోంది. దీంతో మిగతా 13 వేల మంది పరిస్థితి ఏమిటన్న దానిపై ఆయోమయం నెలకొంది.
తెలంగాణ వల్లే: మరోవైపు పొరుగు రాష్ట్రం తెలంగాణా కూడా ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు ఇవ్వటంతోనే ఏపీ కూడా ఈ తరహా నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఆ రాష్ట్రంలోని సాధారణ పరిపాలన శాఖ, ఉన్నత విద్యా, వైద్యారోగ్యం, అటవీశాఖ, న్యాయశాఖ, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖల్లో పని చేస్తున్న 5వేల 544 మందిని క్రమబద్దీకరించారు. దీంతో ఏపీ కూడా ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించే అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.