House Scheme in Andhra Pradesh: పట్టణ పేదల కోసం ఇళ్ల నిర్మాణానికి 2020 డిసెంబర్‌లో శంకుస్థాపన జరిగింది. మొదటి విడతగా చేపట్టిన 15.60 లక్షల గృహాలను 2022 మార్చినాటికి పూర్తిచేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఆ గడువును 2022 డిసెంబర్‌కు పొడిగించినా లక్ష్యం మాత్రం చేరలేదు. గతేడాది డిసెంబర్ నాటికి 15.60 లక్షల ఇళ్లు పూర్తయ్యేలా లేవని ముందుగానే అంచనాకు వచ్చిన ప్రభుత్వం.. అదే గడువుకు కనీసం 5 లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించింది.
ఇందులో టిడ్కో గృహాలు లక్షా 50 వేలు ఉన్నాయి. ఆ లక్ష్యం కూడా నేరవేరకపోగా.. వర్షాల కారణంగా పనులు మందగించాయని అప్పట్లో ప్రభుత్వం వెల్లడించింది. ఆ తర్వాత ఈ ఉగాదికి గడువును మార్చారు. టిడ్కో ఇళ్లతో పని లేకుండా జగనన్న కాలనీల్లో చేపట్టే ఇళ్లు... 5 లక్షలు పూర్తిచేయాలని అప్పట్లో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటివరకు 3.10 లక్షల ఇళ్లు పూర్తికాగా... రూఫ్ కాస్ట్ స్థాయిలో 70 వేలు, రూఫ్ స్థాయిలో మరో 70 వేల గృహాలున్నాయి.
ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులపై ఎంత ఒత్తిడి చేస్తున్నా.. వారు ముందుకు రావడం లేదు. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం ఇచ్చే లక్షా 50 వేలతో కలిపి మొత్తం లక్షా 80 వేల రూపాయలు ఇస్తున్నా.. అవి ఏ మాత్రం సరిపోవనే ఆలోచనతో.. చాలా మంది ఆసక్తి కనబర్చడం లేదు. అలాగే లబ్ధిదారులు ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతాలకు చాలా దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించడం వల్ల కూడా.. చాలా మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి తటపటాయిస్తున్నారు.