మేడికొండూరులో వైకాపా నాయకుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. కొద్ది రోజుల క్రితం ఇళ్ల పట్టాల విషయంపై మేడికొండూరు గ్రామానికి చెందిన నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయి. నేతలంతా రెండు వర్గాలుగా విడిపోయారు. ఇరు వర్గాల వారితో తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి, తాడికొండ నియోజక వర్గ పంచాయతీ ఎన్నికల పరిశీలకులు మర్రి రాజశేఖర్ గుంటూరులో సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఒక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదన్న మనస్థాపంతో.. పార్టీ పదవులకు రాజీనామా చేసేందుకు మరో వర్గం నేతలు సిద్ధమయ్యారు. ఈ విషయంపై చర్చించుకునేందుకు మేడికొండూరులో మంగళవారం తాడికొండ, పేరేచర్ల, మేడికొండూరు నాయకులు సమవేశం అయ్యారు. ఆ సమయంలో మాటా మాటా పెరిగి నాయకుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నాయకులను అక్కడి నుంచి పంపించారు.