TDP Agitation: మండు వేసవిలో అప్రకటిత విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, గరివిడి, గజపతినగరం, డెంకాడ, గంట్యాడ, గుర్ల, లక్కవరపుకోట విద్యుత్తు ఉపకేంద్రాల వద్ద ఆందోళన చేశారు. ఎస్.కోట మండలం పోతనాపల్లి విద్యుత్ ఉపకేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే లలితకుమారి ఆధ్వర్యంలో మోకాళ్లపై నిరసన తెలిపారు. మన్యం జిల్లా పాలకొండ, గుమ్మలక్ష్మీపురం సహా పలు గ్రామాల్లో విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
అనకాపల్లిలో విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లామైలవరం విద్యుత్ సబ్‌స్టేషన్, నందిగామ మండలం చందాపురం సబ్‌స్టేషన్ వద్ద తెలుగుదేశం నేతలు విసన కర్రలు, లాంతర్లతో నిరసన తెలిపారు.కృష్ణా జిల్లా గన్నవరం, కంకిపాడు విద్యుత్ స్టేషన్ల వద్ద టీడీపీ శ్రేణులు కరెంట్ కోతలు నిలిపేయాలని ఆందోళన చేశారు. తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఏ.కొండూరులో ధర్నా నిర్వహించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలపై నెలనెలా బాదుడు కార్యక్రమం చేపట్టారని టీడీపీ నేత బొండా ఉమ ఆరోపించారు. ఛార్జీలు తగ్గించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
జగన్ అధికారంలోకి వచ్చాక నెలవారి బాదుడు జగన్ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీలు పెరిగి, ఒక వైపు చెత్త పన్నులు, నీటి పన్నులు, ఇంటి పన్నులు ఇలా అన్నింటి మీద మోపిన భారాల వల్ల ప్రజల ఓపిక నశించి పోయింది. అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు ఎత్తివేయాలి, కరెంట్ ఛార్జీల పెంపు ఆపివేయాలని డిస్కంల దగ్గర, సబ్స్టేషన్ల వద్ద నిరసనలు, ధర్నాలు చేపట్టాం.-బొండా ఉమ, టీడీపీ నేత