అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళన 569వ రోజుకు చేరింది. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, బోరుపాలెం, మోతడక,పెదపరిమి, వెంకటపాలెం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. 29 వేల మంది రైతులను రోడ్డుపాలు చేసిన వైకాపా ప్రభుత్వానికి రైతు దినోత్సవం నిర్వహించే నైతిక హక్కు లేదని రైతులు అన్నారు.
కౌలు చెక్కులు ఇవ్వకుండా, అసైన్డ్ రైతులకు డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోయారు. అన్నదాతలంతా సంతోషంగా ఉన్న రోజే అసలైన రైతు దినోత్సవమన్నారు. పంటలు వేసిన అన్నదాతలకు గిట్టుబాటు ధర, సమయానికి నీళ్లు ఇవ్వకపోవడం, గతేడాది తుపాను నష్ట పరిహారం ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.