ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జాతీయ మహిళా కమిషన్​కు ఫిర్యాదుల వెల్లువ

By

Published : Jan 13, 2020, 4:38 AM IST

అమరావతిలో పర్యటించిన జాతీయ మహిళా కమిషన్‌ క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిశీలించింది. ప్రజాప్రతినిధులు, బాధితుల నుంచి వివరాలు సేకరించింది. పోలీసుల దాడులకు చెందిన దృశ్యాలను మహిళలు చరవాణిల్లో చూపించారు. ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు ...రాజధాని గ్రామాల్లోని ఆందోళనలపై వారి వినతులు కమిషన్‌కు సమర్పించారు. అటు తమపైనా దాడి జరిగిందని కమిషన్‌ ముందు పోలీసులు తమ వాదన వినిపించారు.

జాతీయ మహిళా కమిషన్​కు ఫిర్యాదుల వెల్లువ
జాతీయ మహిళా కమిషన్​కు ఫిర్యాదుల వెల్లువ

రాజధానిలో మహిళలపై జరిగిన దాడిని తెలుసుకునేందుకు జాతీయ మహిళ కమిషన్ సభ్యులు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. మొదట రాయపూడి వెళ్లి... అక్కడ మహిళలపై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. స్త్రీలపై దాడుల గురించి....తహసీల్దార్, డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. తర్వాత తుళ్లూరులోని దీక్షాశిబిరానికి వెళ్లిన జాతీయ మహిళా కమిషన్ సభ్యులు.... అక్కడి వారితో మాట్లాడారు. పోలీసులు తమ గ్రామంలో దౌర్జన్యానికి దిగుతున్నారని మహిళలు వాపోయారు. ఆంక్షలు విధించి తమపై దాడులు చేసిన విధానాన్ని కమిషన్ సభ్యులకు వివరించారు.

రాజధాని గ్రామాల్లో పర్యటించిన అనంతరం జాతీయ మహిళా కమిషన్ సభ్యులు విజయవాడ క్లబ్ కు చేరుకున్నారు. అక్కడ ఎంపీ కేశినేని నాని‌, అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు...మహిళలపై జరిగిన దాడులను వారికి వివరించారు. మగ పోలీసులు అసభ్యకరంగా మహిళల పట్ల ప్రవర్తించారని.. రాత్రి వరకు స్టేషన్లలో నిర్బంధించారని ఆవేదన వెలిబుచ్చారు. 500 వీడియోలు, వెయ్యి ఫోటోలను కమిషన్‌కు అందించారు

విజయవాడ క్లబ్‌ నుంచి నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లిన కమిషన్‌ సభ్యులు...సీపీ ద్వారకా తిరుమలరావు సహా ఇతర పోలీసు అధికారులతో 40 నిమిషాలపాటు మాట్లాడారు. తర్వాత విజయవాడ ఆయుష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీలక్ష్మని పరామర్శించారు. అక్కడ వైద్యులను అడిగి బాధితురాలి పరిస్థితి తెలుసుకున్నారు. ఆమె తండ్రి, భర్త నుంచి ప్రతినిధులు వివరాలు నమోదు చేసుకున్నారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చే క్రమంలో మహిళలు తమ గోడు వినాలంటూ కమిషన్ ప్రతినిధుల కారు ముందు బైఠాయించే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని నిలువరించారు. తర్వాత మహిళల కంట పడకుండా కమిషన్ సభ్యులను ఆస్పత్రి వెనుక వైపు నుంచి పంపివేశారు.

జాతీయ మహిళా కమిషన్

ఇదీచదవండి

'ప్రతి గ్రామం.. తుళ్లూరు, మందడం కావాలి'

ABOUT THE AUTHOR

...view details