ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదుకుంటారనుకుంటే... అన్యాయం చేశారు! - సుద్దపల్లి డొంక హౌస్ లోన్ మోసం న్యూస్

తమ యజమానురాలు.. తన కష్టం చూసి.. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇప్పించేందుకు దరఖాస్తు చేయిస్తోందని సంబరపడిందామె. నమ్మి ఆధార్, రేషన్ కార్డు వంటి వివరాలను అందజేసింది. చివరికి ఆ యజమానురాలు మోసం చేసి.. తన పేరు మీదే గృహ నిర్మాణ లోను తీసుకుందని తెలిసి నిర్ఘాంతపోయిందా అమాయకురాలు. అన్యాయాన్ని ప్రశ్నించేందుకు యజమానురాలి దగ్గరికి వెళ్తే.. దాడి చేయటమే కాక.. దిక్కున్న చోట చెప్పుకోవాలని తరిమేసింది. చివరికి బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

house loan cheating
ఎస్సీ కార్పొరేషన్ లోన్ పేరిట మోసం

By

Published : Feb 8, 2021, 8:30 PM IST

ఎస్సీ కార్పొరేషన్ లోన్ పేరిట మోసం

తమ పేరుతో మరొకరు గృణ నిర్మాణ రుణాలు తీసుకున్నారని.. సంక్షేమ పథకానికి దరఖాస్తు చేస్తే అధికారులు తిరస్కరిస్తున్నారని.. గుంటూరు సుద్ధపల్లి డొంకకు చెందిన కొందరు బాధితులు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని ఆశ్రయించారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇప్పిస్తామంటూ తమ వద్ధ ఆధార్, రేషన్ కార్డు వంటి ధ్రువపత్రాలు తీసుకున్నారని... వాటితోనే బినామీ రుణాలు పొందుతున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. తమ పేరుపై రుణం ఉండటంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కుంభకోణంపై పోలీసులు దర్యాప్తు నిర్వహించి తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.

తన పేరిట గృహ నిర్మాణాల రుణం తీసుకున్నారనీ... బాధ్యులను శిక్షించాలంటూ ఓ మహిళ గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని ఆశ్రయించారు. గుంటూరు జిల్లా సుద్దపల్లి డొంకకు చెందిన నాగమణి.. ఓ కిరాణా షాపులో పని చేస్తోంది. ఆ షాపు యజమానురాలు సుశీలమ్మ ఎస్సీ కార్పొరేషన్​లో రుణాలు ఇప్పిస్తామంటూ.. తన వద్ద ఆధార్, రేషన్ కార్డులను తీసుకున్నట్టు ఆరోపించింది. వాటితో తన పేరిట గృహ నిర్మాణ రుణాలు తీసుకున్నారని ఆవేదన చెందింది.

మూడేళ్ల క్రితం తీసుకుంటే... ఇప్పుడు వెలుగులోకి..!

మూడేళ్ల క్రితమే నాగమణి ధ్రువపత్రాలతో... సుశీలమ్మ గృహ నిర్మాణ రుణాలు తీసుకున్నారు. అద్దె ఇంట్లో ఉంటున్న నాగమణి... జగనన్న ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా, ఆమె ధ్రువపత్రాన్ని తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారని అధికారులను ప్రశ్నించటంతో అసలు విషయం బయటకు వచ్చింది.

నిలదీస్తే... దాడికి దిగారు

తన పేరున రుణాలు తీసుకున్నారా అని అడిగేందుకు సుశీలమ్మ ఇంటికి వెళ్తే... తనపై దాడికి దిగారని బాధితురాలు నాగమణి ఆరోపించారు. తనకు ఉన్నతాధికారులు, బ్యాంకు వాళ్లు తెలుసునని.. దిక్కున్న చోట చెప్పుకోవాలని సుశీలమ్మ అన్నారని నాగమణి వాపోయారు.

న్యాయం చేయండి

తన పిల్లలతో అద్దింట్లో అనాథగా బతుకుతన్నామనీ.. తమకు న్యాయం చేయాలని నాగమణి వేడుకుంది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని కోరింది.

ఇదీ చదవండి:

వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను అణచివేస్తోంది: జీవీ

ABOUT THE AUTHOR

...view details