గుంటూరు జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతోందని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. మొదటి దశలో పంచాయతీ ఎన్నికలు జరిగే తెనాలి రెవిన్యూ డివిజన్లో ఆయన పర్యటించారు. తెనాలి ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల అధికారులతో సమావేశమయ్యారు. నామినేషన్ల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలింగ్ కేంద్రాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులు, ప్రజలకు గానీ ఏవైనా ఎన్నికల సంబంధిత సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎన్నికల పర్యవేక్షణకు, ఫిర్యాదుల స్వీకరణకు రెండు ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం అధికారులు విధులు నిర్వహించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు. గ్రామ పంచాయితీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి సిబ్బందికి శిక్షణ, పని విభజన, రవాణా ఏర్పాట్లు, మౌలిక వసతులు, ఎన్నికల సామాగ్రి చేరవేత, కాల్ సెంటర్ నిర్వహణపై అధికారులతో చర్చించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పెట్టే ఖర్చులపై నిఘా ఉంచాలన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దని పోలీసు అధికారులకు సూచించారు. 1,950 ఓటర్ సహాయ బృందాలు, బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్, మీడియా, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్, వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్, పోలింగ్ స్టేషన్స్, కరోనా సంబంధిత అంశాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్యాలెట్ బాక్సుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. అదనపు బాక్సులు కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం:
చేబ్రోలు మండలంలో పోలింగ్ కేంద్రాలపై పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నట్లు తెనాలి డీఎస్పీ ప్రశాంతి అన్నారు. తొలి దశ ఎన్నికలు చేబ్రోలు మండలం పరిధిలో ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద, అర్బన్ జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే మండల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ:
జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తొలిరోజు అభ్యర్థులు మందకొడిగా నామినేషన్లు దాఖలు చేశారు. ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు తీసుకుని వెళ్లారు. నామినేషన్ పత్రాలు పూర్తి వివరాలతో పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడంతో మొదటిరోజు ఎక్కువమంది నామినేషన్లు దాఖలు చేయలేదు. మరోవైపు కొన్ని కీలకమైన పంచాయతీల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కిరాకపోకవడం కూడా నామినేషన్లు తక్కువగా నమోదుకావడానికి కారణమని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.