OTS Dwacra:రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా రుణం తీసుకుని కట్టిన ఇళ్లకు వన్‌టైం సెటిల్‌మెంట్ (ఓటీఎస్) పేరుతో చేపట్టిన వసూళ్ల కోసం ప్రభుత్వం డ్వాక్రా అస్త్రం ప్రయోగిస్తోంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులపై అధికారులు ఎంత ఒత్తిడి తెచ్చినా వసూళ్లు ఆశించినంత లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది. నిర్దేశించిన మొత్తాన్ని (రూ.10 వేలు, రూ.15 వేలు, రూ.20 వేలు) సేకరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల వద్దకు వెళ్లగా ఇప్పటికిప్పుడు అంత మొత్తం ఎలా కట్టాలని వారు ప్రశ్నిస్తుండటంతో వసూళ్లను పెంచుకునేందుకు డ్వాక్రాను తెరమీదకు తెచ్చింది. ఓటీఎస్ లబ్ధిదారుల్లో డ్వాక్రా సభ్యులు భారీగానే ఉండటంతో సేకరణలో వెలుగు, డీఆర్‌డీఏలను భాగస్వాములను చేసింది. సభ్యుల ఇళ్ల వద్దకు యానిమేటర్లు, సీసీలను పంపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటీఎస్ లబ్ధిదారులు 46 లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించినా 39 లక్షల మంది
వివరాలే లభ్యమయ్యాయి.
వాస్తవానికి డ్వాక్రా రుణాలు...
ఓటీస్ రుణాన్ని చెల్లించేందుకు డ్వాక్రా సభ్యులతో అప్పు చేయిస్తున్నారు. రుణం చెల్లించేందుకు నగదు లేదంటున్న డ్వాక్రా సభ్యులకు బ్యాంకు లింకేజీ, పొదుపు నుంచి రుణం ఇప్పిస్తున్నారు. బ్యాంకుల ద్వారా రుణం తీసుకుంటే 9% వడ్డీతో తిరిగి చెల్లించాలి. అదే పొదుపు ద్వారా అయితే రూపాయి వడ్డీ (12%) కట్టాలి. వాస్తవానికి డ్వాక్రా రుణాలను వారి జీవనోపాధికి వినియోగించుకోవాలి. కాని ప్రభుత్వం ఇలా అప్పులకు వినియోగించుకోవడం విమర్శల పాలవుతోంది. ఓటీఎస్ మొత్తాన్ని కట్టేందుకు పొదుపు ద్వారా రూ.10వేలు తీసుకుంటే ఆ రుణాన్ని 10 నెలల్లో నెలకు రూ.1,100 చెల్లించాలని విశాఖ జిల్లా నక్కపల్లిలో వెలుగు అధికారులు లబ్ధిదారులకు చెబుతున్నారు. అంటే 10 నెలల్లో అదనంగా రూ.1000 చెల్లించాలి.
డ్వాక్రా సభ్యులతో ప్రత్యేక జాబితా సిద్ధం...
వీటిని క్షేత్రస్థాయికి పంపి పరిశీలిస్తే 23 లక్షల మందినే గుర్తించగలిగారు. వీరి వివరాలను ఆన్‌లైన్ చేశారు. వీరిలో డ్వాక్రా సభ్యుల్ని గుర్తించేందుకు మండలాల్లోని వెలుగు కార్యాలయాలకు పంపి డ్వాక్రా సభ్యులతో ప్రత్యేక జాబితాను సిద్ధం చేశారు. అధికారులు ఎక్కువగా డ్వాక్రా సభ్యుల నుంచి వసూళ్లు రాబట్టడంపై దృష్టి సారించారు. కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఇప్పటికే జిల్లా స్థాయి ఓటీఎస్ మేళాలు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లాలో 1.17 లక్షల మంది ఓటీఎస్ లబ్ధిదారులు ఉంటే అందులో పొదుపు మహిళలు 81 వేలమంది ఉన్నట్లు గుర్తించారు. బ్యాంకు లింకేజి, పొదుపు నుంచి 1,800 మంది రుణం తీసుకుని కట్టారు. కడప జిల్లా ముద్దనూరు మండలంలో 9 వేల మంది ఓటీఎస్ లబ్ధిదారులు ఉండగా అందులో 6వేల మందిని అధికారులు గుర్తించారు. ఇందులో 700 మంది వరకు డ్వాక్రా సభ్యులు, వారి కుటుంబసభ్యులు ఉంటారని గుర్తించారు. స్థానికంగా ఉన్న సీసీలు, యానిమేటర్లు వారం రోజులుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వసూలుకు చర్యలు చేపట్టారు. రెండు రోజుల క్రితం మండలం నుంచి 50 మందితో ఓటీఎస్ మొత్తాన్ని కట్టిస్తే అందులో అత్యధికులు డ్వాక్రా సభ్యులే. అనంతపురం జిల్లా యాడికి మండలంలో 4,500 మంది వరకు ఓటీఎస్ లబ్ధిదారులు ఉంటే అందులో 500 మంది వరకు డ్వాక్రా సభ్యులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఇప్పటివరకు వందమంది పైనే రుణం తీసుకుని చెల్లించారు.
మార్కాపురంలో ఒక్కో వీవోఏకి 10 మంది టార్గెట్
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పరిధిలో ఒక్కో యానిమేటర్ (వీవోఏ) 10 మంది లబ్ధిదారులతో ఓటీఎస్ మొత్తాన్ని కట్టించాలని అక్కడి అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. ‘ఒక్కో లబ్ధిదారుని విడివిడిగా కలవండి. పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తే అడ్డుపుల్లలు వేస్తారు. ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే కట్టించవచ్చు. ఓటీఎస్ చెల్లింపులు ప్రాధాన్య అంశంగా తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడతారు. మొత్తం ప్రక్రియను సోమవారానికి పూర్తిచేయాలి’ అని ఆదేశించారు. అధికారుల ఒత్తిడితో భూపతిపల్లి, చింతకుంట, తిప్పాయపాలెం, గజ్జలకొండ, రాయవరం గ్రామాల్లోని కొంతమంది ఓటీఎస్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వీవోఏలు ఆదివారం వెళ్లారు. చేతిలో డబ్బుల్లేక పండుగ కూడా చేసుకునే పరిస్థితి లేదని, ఇప్పుడు వచ్చి అప్పు కట్టాలంటే ఎలా కడతామని లబ్ధిదారులు వీవోఏలకు తెగేసి చెప్పారు.
ఇదీ చదవండి:'ఈ పీఆర్సీ అసలే వద్దు.. పాత వేతనాలు, డీఏ ఇవ్వండి'