CM Video Conference with Collectors and SPs About Cyclone:తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంటల రక్షణ, పంటలకు పరిహారం అందించడం, సహా తడిసిన ధాన్యాన్ని కొనుగోలుకు సంబంధించి రైతులకు తోడుగా నిలబడాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. 80శాతం సబ్సిడీపై విత్తనాల సరఫరాకూ అన్ని రకాలుగా సిద్ధం కావాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన అత్యధిక ప్రాధాన్యతతో విద్యుత్‌ను పునరుద్ధరించాలని నిర్దేశించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావం,చేపడుతున్న సహాయక చర్యలపై సీఎంకి వివరాలు అందించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపైనా దృష్టి పెట్టాలని సీఎం నిర్దేశించారు. తామందరం తోడుగా ఉన్నామన్న సీఎం ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నట్లు తెలిపారు.
పంట నీటి పాలైందని మహిళా రైతు కన్నీరు - మనసు చలించే దృశ్యం
పంటపొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. అధికారులంతా మీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టిపెట్టాలన్నారు. బాధితులపట్ల సానుభూతితో వ్యవహరించాలని, బాధితుల స్ధానంలో మనం ఉంటే ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో ఆ తరహా సాయం వారికి అందాలన్నారు. బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని, పరిహారం అందించడంలో సానుభూతితో ఉండాలని సీఎం నిర్దేశించారు. సాయంలో ఎక్కడా లోటు రాకూడదని, రేషన్ పంపిణీలోనూ ఎలాంటి లోపం ఉండకూడదన్నారు. దురదృష్టవశాత్తూ విధి నిర్వహణలో ఉండగా చెట్టుకూలి కానిస్టేబుల్ చనిపోయాడని, ఆ కుటుంబానికి రూ.30 లక్షలు సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు.