ఫలితాలు ఎలా ఉన్నా.. పిల్లలను ప్రోత్సహించండి: సీఎం - ఫలితాలు
మంగళవారం విడుదల కానున్న పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నా పిల్లలకు అండగా ఉండాలని తల్లిదండ్రులను కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.
రాష్ట్ర పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి సందేశాత్మక ట్వీట్ చేశారు. ఫలితాలు విడుదల అయ్యాక... మార్కులను బట్టి వారిని నిందించడం, ఇతర పిల్లలతో పోల్చడం వంటివి చేయవద్దని తల్లిదండ్రులను కోరారు. పిల్లల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయరాదని సూచించారు. ధైర్యం చెప్పాలని, ఈ ఫలితాలు తెలివితేటలకు కొలమానాలు కాదని ట్వీట్ చేశారు. కిందపడినా రివ్వున పైకి లేచే కెరటాల్లా రెట్టించిన ఉత్సాహంతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని వారిలో ప్రేరణ కలిగించాలన్నారు. పాఠశాల విద్యాశాఖ... మంగళవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనుందన్న ముఖ్యమంత్రి.... ఆర్టీజీఎస్ వెబ్‌సైట్, పీపుల్ ఫస్ట్ మొబైల్ యాప్, ఖైజాలా యాప్, ఫైబర్ నెట్ టీవీ తెరపైనా ఫలితాలు తెలుసుకోవచ్చని తెలిపారు.