CM Revanth Reddy Visits KCR At Yashoda Hospital : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్(KCR)ను పరామర్శించారు. తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత కోలుకుంటున్న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని యశోదా ఆసుపత్రి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య బృందాన్ని సీఎం ఆదేశించారు. మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆకాంక్షించారు. కొన్ని రోజుల్లో జరిగే శాసనసభా సమావేశాలకు కేసీఆర్ హాజరు కావాలని రేవంత్ అభిలాషించారు. ప్రజా సమస్యలపై కేసీఆర్ శాసనసభా వేదికగా గళమెత్తాలని కొత్త ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు అందజేయాలన్నారు.
CM Revanth Reddy Meet KCR :యశోదా ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి సీతక్క(Seethakka) కూడా వెళ్లారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, షబ్బీర్ అలీ, ప్లానింగ్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌లు కూడా కేసీఆర్‌ను పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, తొందరలోనే కేసీఆర్ డిశ్చార్జ్ అవుతారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
'కేసీఆర్‌ను పరామర్శించాను, ఆయన కోలుకుంటున్నారు. కేసీఆర్ వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించా. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని కోరాను. మంచి ప్రభుత్వం అందించడానికి కేసీఆర్ సూచనలు అవసరం ఉంది. ప్రజల పక్షాన కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరముంది. త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కేసీఆర్‌ను కోరాను.'-రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
KCR Treatment at Yashoda Hospital : ప్రమాదవశాత్తు జారి కిందపడి గాయాలుపాలై చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు కోదండ రెడ్డి, వి.హనుమంతురావులు పరామర్శించారు. కాంగ్రెస్ నేతలను మంత్రి కేటీఆర్(KTR) దగ్గరుండి ఆస్పత్రిలోనికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరగా కేసీఆర్ కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు నాయకులు ఆకాంక్షించారు.