KCR on TRS mlas buying: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు నోరువిప్పారు. ఉపఎన్నిక ముగిసిన అనంతరం ప్రగతి భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. ఎమ్మెల్యేలకు ఎరకు సంబంధించిన వీడియోలను రిలీజ్ చేసిన కేసీఆర్... కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత నెలలోనే రామచంద్ర భారతి అనే వ్యక్తి ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. విశ్వ ప్రయత్నాలు చేసి... తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు.
అయితే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈ విషయాన్ని తనకు చెప్పినట్లు తెలిపారు. మొత్తం మూడు గంటలు వీడియో ఫుటేజ్ ఉందని వెల్లడించారు. ఆయితే ఆ వీడియోలో పలు కీలక అంశాలు బయటకు వచ్చాయన్నారు. భాజపా ప్రభుత్వం ఇప్పటికే 8 ప్రభుత్వాలను కూల్చేసిందని... నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ, దిల్లీ, ఏపీ రాజస్థాన్ అని.. వీడియోలో తెలిపినట్లు వివరించారు. అయితే దీనిపై కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ముఠాల కుట్రను బద్ధలు కొట్టాలని అనుకున్నామని తెలిపారు. తెలంగాణ చైతన్యవంతమైన గడ్డ కాబట్టే ఈ ముఠా కుట్రలను బద్ధలు కొట్టిందని గర్వంగా చెప్పారు. తెలంగాణ హైకోర్టుకు కూడా వీడియోలు పంపించామన్నారు. ఈ ముఠా చిన్నది కాదు... 24 మంది ఉన్నామని వాళ్లే చెప్పారని స్పష్టం చేశారు.